'డబుల్' కొడతారా.. 'రికార్డు' సృష్టిస్తారా?
హైదరాబాద్: ఐపీఎల్ -8లో భాగంగా ఆదివారం సాయంత్రం జరగబోయే ఫైనల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్తో తలపడనుంది. ఈ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ గెలిస్తే.. ఐపీఎల్ లో రెండో టైటిల్ సాధించిన జట్ల సరసన చేరుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ గెలిస్తే.. ఐపీఎల్ చరిత్రలో మూడుసార్లు చాంపియన్ గా నిలిచిన జట్టుగా సరికొత్త రికార్డు సృష్టించనుంది. ఫైనల్ సమరానికి కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదిక సిద్ధమైంది. ఈ రెండు జట్లు ఫైనల్లో రెండుసార్లు తలపడగా.. చెరోసారి విజయం సాధించాయి.
ముంబై ఫైనల్ చేరిన ప్రతిసారీ చెన్నైతోనే తలపడింది. 2010లో ముంబైపై చెన్నై గెలవగా.. 2013లో చెన్నైపై ముంబై ఇండియన్స్ గెలిచింది. తాజాగా మూడోసారి ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి. మరోవైపు చెన్నై మాత్రం ఆరుసార్లు ఫైనల్ చేరగా.. మూడుసార్లు ముంబైతో (నేటి మ్యాచ్ కలిపి).. రాజస్థాన్ రాయల్స్, కోల్ కతా నైట్ రైడర్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లతో ఒక్కోసారి తలపడింది.
బలాబలాలు: ఈ సీజన్లో ఇప్పటిదాకా ముంబై ఇండియన్స్ అద్భుతమైన ఫామ్ కనబరుస్తోంది. ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్తో పాటు ఓపెనర్లు పార్థివ్ పటేల్, సిమ్మన్స్.. అదే విధంగా కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్లో రాణిస్తున్నారు. మరోవైపు బంతితో లసిత్ మలింగ, హర్భజన్ సింగ్ ముంబై విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
చెన్నై జట్టులో ఓపెనర్ మెక్ కల్లమ్ లేకపోవటం ఆ జట్టుకు లోటు. మెక్ కల్లమ్ స్థానంలో జట్టులోకి వచ్చిన మైక్ హస్సీ కూడా బ్యాటింగ్లో అదరగొడుతున్నాడు. అంతేకాకుండా డ్వేన్ స్మిత్, డుప్లెసిస్, ఎంఎస్ ధోని, రైనా బ్యాటింగ్లో ఆకట్టుకుంటుండగా.. పవన్ నేగి, డ్వేన్ బ్రేవో తమ ఆల్ రౌండ్ ప్రదర్శనతో జట్టుకు విజయాన్ని అందిస్తున్నారు. బౌలింగ్ విషయంలో చెన్నై కాస్త బలహీనమే అని చెప్పాలి. పేసర్ అశిష్ నెహ్రాతో పాటు ఆల్ రౌండర్ బ్రేవో మాత్రమే రాణిస్తున్నారు.