
ముంబై మహాన్...
► సన్‌రైజర్స్‌పై 9 వికెట్లతో విజయం
► ప్లే ఆఫ్‌కు రోహిత్ సేన
► లీగ్ దశతోనే సరిపెట్టుకున్న హైదరాబాద్
గత సీజన్ ఐపీఎల్‌లోనూ ఇంతే. అప్పుడు బ్యాట్స్‌మెన్... ఇప్పుడు బౌలర్లు... చావో రేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ విశ్వరూపం చూపించింది. బౌలర్ల సంచలన ప్రదర్శనకు బ్యాట్స్‌మెన్ నిలకడ తోడవడంతో 9 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసి సగర్వంగా ప్లే ఆఫ్‌కు చేరింది. 16 పాయింట్లతో బెంగళూరు, రాజస్తాన్‌తో సమానంగా నిలిచినా... విజయాల సంఖ్య (8) ఎక్కువగా ఉండటంతో ఏకంగా రెండో స్థానంలో నిలిచింది. మరోవైపు సన్‌రైజర్స్ కీలక మ్యాచ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది.
సాక్షి, హైదరాబాద్ : చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ పూర్తిగా చల్లబడింది. టోర్నీ అంతటా జట్టుకు వెన్నెముకలా నిలిచిన ఓపెనర్లు విఫలం కావడంతో... మ్యాచ్ ప్రథమార్ధంలోనే పూర్తిగా చేతులెత్తేసింది. ఉప్పల్ స్టేడియంలో ఆదివారం ఏకపక్షంగా సాగిన ఐపీఎల్-8 చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 9 వికెట్ల తేడాతో సన్‌రైజర్స్‌ను చిత్తు చేసింది. టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 113 పరుగులకే కుప్పకూలింది. లోకేశ్ రాహుల్ (24 బంతుల్లో 25; 2 ఫోర్లు)దే అత్యధిక స్కోరు. ముంబై బౌలర్లలో మెక్లీన్‌గన్ (3 /16), మలింగ (2 /17) పేస్‌తో చెలరేగారు. అనంతరం ముంబై 13. 5ఓవర్లలో వికెట్ నష్టానికి 114 పరుగులు చేసి విజయాన్నందుకుంది. సిమన్స్ (44 బంతుల్లో 48; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), పార్థీవ్ పటేల్ (37 బంతుల్లో 51 నాటౌట్; 9 ఫోర్లు) తొలి వికెట్‌కు 106 పరుగులు జోడించి జట్టు గెలుపును సునాయాసం చేశారు. మరో 37 బంతులు మిగిలి ఉండగానే ముంబై గెలవడం విశేషం.
సమష్టి వైఫల్యం
రెండు బౌండరీల మధ్య ఒకసారి 23 బంతులు, మరో సారి 36 బంతుల విరామం వస్తే... ఇన్నింగ్స్ తొలి సిక్సర్ 14.5 ఓవర్లకు గానీ రాలేదు... ముంబైతో మ్యాచ్‌లో మెరుపులే లేని సన్‌రైజర్స్ బ్యాటింగ్ పరిస్థితి ఇది. సీజన్ మొత్తం శుభారంభాలు ఇచ్చిన హైదరాబాద్ ఓపెనింగ్ జోడి అసలు మ్యాచ్‌లో విఫలమైంది. ధావన్ (1), వార్నర్ (6) వరుస బంతుల్లో అవుట్ కావడం జట్టు ఇన్నింగ్స్‌పై తీవ్ర ప్రభావం చూపింది.
మలింగ చక్కటి యార్కర్‌తో ధావన్‌ను బౌల్డ్ చేయగా, మెక్లీన్‌గన్ షార్ట్ బంతిని పుల్ చేయబోయి వార్నర్ క్యాచ్ ఇచ్చాడు. అంతే...ఆ తర్వాత రైజర్స్ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఒక్క బ్యాట్స్‌మన్ కూడా కుదురుగా క్రీజ్‌లో నిలబడలేకపోగా... కనీస స్థాయిలో కూడా ధాటిగా బ్యాటింగ్ చేయలేకపోయారు. మోర్గాన్ (9) వైఫల్యానికి తోడు కుర్ర స్పిన్నర్ సుజిత్ సన్‌ను దెబ్బ తీశాడు. అతను వేసిన చక్కటి బంతికి హెన్రిక్స్ (11) స్టంపౌట్ కాగా, తర్వాతి బంతికే నమన్ ఓజా (0) సునాయాస క్యాచ్ ఇచ్చాడు. మరో వైపు రాహుల్ కాస్త పోరాడే ప్రయత్నం చేయగా...చివర్లో స్టెయిన్ (11 బంతుల్లో 19 నాటౌట్; 3 ఫోర్లు) జట్టు స్కోరును 100 పరుగులు దాటించాడు.
అలవోకగా ఓపెనర్లే...
సునాయాస లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు సిమన్స్, పార్థివ్ శుభారంభం అందించారు. సన్ బౌలర్లను అలవోకగా ఎదుర్కొని చకచకా పరుగులు సాధించడంతో పవర్‌ప్లేలో జట్టు స్కోరు 38 పరుగులకు చేరింది. ఆ తర్వాత కూడా ఏ ఒక్క హైదరాబాద్ బౌలర్ కూడా ముంబై బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టలేకపోయాడు. తక్కువ స్కోరు కావడం వల్ల కాపాడుకోలేమని ముందే ఓటమికి సిద్ధమైనట్లు సన్ ఆటగాళ్లు కనిపించారు. ఏ దశలోనూ ఒత్తిడి పెంచలేకపోగా, ఫీల్డింగ్ వైఫల్యాలతో సునాయాస పరుగులు ఇచ్చారు. తొలి వికెట్‌కు పార్థీవ్, సిమ్మన్స్ 106 పరుగులు జోడించారు. చివర్లో సిమ్మన్స్ అవుటైనా... రోహిత్ వచ్చి లాంఛనం పూర్తి చేశాడు.