కొత్త హీరోలు | The new heroes | Sakshi
Sakshi News home page

కొత్త హీరోలు

Published Sat, May 16 2015 2:26 AM | Last Updated on Sun, Sep 3 2017 2:06 AM

కొత్త హీరోలు

కొత్త హీరోలు

ఈ ఐపీఎల్‌కు ముందు క్రికెట్ అభిమానులకు కనీసం పాండ్యా పేరు కూడా తెలియదు.

హార్థిక్ హిమాన్షు పాండ్యా
 
 ఈసారి ఐపీఎల్ వేలంలో అన్ని ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్ల వైపు కాకుండా దేశవాళీ క్రికెటర్లను తీసుకునేందుకు ఎక్కువగా ఆసక్తి చూపాయి. ఆటలో అనుభవం అంతగా లేకపోయినా... కొంత మందిపై పెద్ద మొత్తంలోనే ఖర్చు చేశాయి. అలా అవకాశం దక్కించుకున్న వారిలో కొంత మందికి ఆడే అవకాశం రాకపోయినా.. వచ్చిన వారు మాత్రం దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకున్నారు. వారిలో ముంబై ఇండియన్స్ కుర్రాడు హార్థిక్ పాండ్యా, ఢిల్లీ ఓపెనర్ శ్రేయస్ అయ్యర్‌లు ఈ సీజన్‌లో హాట్‌గా మారారు. 
                           
 సాక్షి క్రీడావిభాగం : ఈ ఐపీఎల్‌కు ముందు క్రికెట్ అభిమానులకు కనీసం పాండ్యా పేరు కూడా తెలియదు. 1993లో సూరత్‌లోని చోరాసిలో జన్మించిన పాండ్యా... బరోడా జట్టు తరఫున దేశవాళీ క్రికెట్ ఆడుతూ నాణ్యమైన ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 2013లో దేశవాళీలో ఓ మోస్తరు ప్రదర్శనతో తన ప్రతిభను బయటపెట్టినా.. 2013-14 సీజన్ ముస్తాక్ అలీ ట్రోఫీలో తనెంటో చూపెట్టాడు. బరోడాకు ట్రోఫీని అందించడంలో కీలక పాత్ర పోషించిన అతను ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో కేవలం 6 మ్యాచ్‌లే ఆడి 285 పరుగులు చేశాడు.

లిస్ట్-ఎలో నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. ఓవరాల్‌గా 10 మ్యాచ్‌ల అనుభవంతో రూ. 10 లక్షల కనీస ధరతో ఐపీఎల్‌లో వేలంలోకి వచ్చిన అతన్ని ముంబై అదే ధరకు దక్కించుకుంది. అయితే ఈ లీగ్‌లో తొలి నాలుగు మ్యాచ్‌లకు డగౌట్‌కు పరిమితమైన పాండ్యా... ఆర్‌సీబీతో తొలి మ్యాచ్ ఆడాడు. కేవలం 16 పరుగులే చేసినా... తనలో ఆత్మ విశ్వాసాన్ని మాత్రం అమోఘంగా పెంపొందించుకున్నాడు. స్టార్లతో కళకళలాడే ముంబై జట్టులో అవకాశం దక్కడమే గొప్ప. అలాంటి పరిస్థితుల్లో వచ్చిన అవకాశాన్ని రెండు చేతులా ఒడిసిపట్టుకున్నాడు.

ప్రస్తుతం అతను ముంబై జట్టులో సరికొత్త సంచలనం. పటిష్టమైన చెన్నైతో ఈనెల 8న జరిగిన మ్యాచ్‌లో కేవలం 8 బంతుల్లో 21 పరుగులు చేయడంతో పాటు మైదానంలో మెరుపు కదలికలతో మూడు కీలక క్యాచ్‌లు అందుకున్నాడు. ఫలితంగా కీలక మ్యాచ్‌లో చెన్నైపై ముంబై గెలిచింది. ప్లే ఆఫ్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో కోల్‌కతాపై 31 బంతుల్లోనే 61 పరుగులు చేసి ముంబైకి ఒంటిచేత్తో విజయాన్ని అందించాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకూ ఆడిన 6 మ్యాచ్‌ల్లో 111 పరుగులు సాధించాడు.
 
 చిన్నప్పట్నించి క్రికెట్ అంటే అమితాసక్తి చూపే శ్రేయస్‌ను 12 ఏళ్ల వయసులో జింఖానా శివాజీ పార్క్‌లో కోచ్ ప్రవీణ్ ఆమ్రే గుర్తించాడు. ఆరంభంలో కుర్రాడి ప్రతిభకు మెరుగులు దిద్దిన ఆమ్రే.. శ్రేయస్ క్రికెట్ కెరీర్‌కు చక్కని పునాది వేశాడు. బంతిని బలంగా బాదడంలో సిద్ధహస్తుడు కావడంతో శ్రేయస్ వయసు గ్రూప్ వాళ్లందరూ అతన్ని సెహ్వాగ్‌తో పోల్చేవారు. ప్రస్తుతం పొడర్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ చేస్తున్న శ్రేయస్... కాలేజీ తరఫున చాలా టోర్నీలు ఆడాడు.

అద్భుతమైన ప్రతిభతో తన జట్టుకు ట్రోఫీలను సాధించిపెట్టడంతో ఒక్కసారిగా అతని ప్రతిభ ముంబైని తాకింది. గతేడాది నవంబర్‌లో లిస్ట్-ఎ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన శ్రేయస్... విజయ్ హజారే ట్రోఫీలో 273 పరుగులు సాధించి అందరి దృష్టిలో పడ్డాడు. డిసెంబర్‌లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. 2014-15 రంజీ సీజన్‌లో ముంబై తరఫున రెండు సెంచరీలతో 809 పరుగులు సాధించాడు. ఫిబ్రరిలో జరిగిన వేలానికి రూ. 10 లక్ష బేస్ ప్రైస్‌తో వచ్చాడు.

కానీ ఢిల్లీ అనూహ్యంగా రూ. 2.6 కోట్లకు శ్రేయస్‌ను తీసుకుంది. దీంతో టోర్నీలోనే అత్యధిక ధర పలికిన అన్‌క్యాప్‌డ్ ప్లేయర్‌గా రికార్డు సృష్టించాడు. లీగ్ ఆరంభం నుంచి ఢిల్లీ జట్టులో చోటు దక్కించుకున్న శ్రేయస్... బ్యాటింగ్‌లో నిలకడగా రాణిస్తున్నాడు. సన్‌రైజర్స్, ముంబై, కింగ్స్ ఎలెవన్, చెన్నైపై అర్ధసెంచరీలతో చెలరేగాడు. జట్టులో యువరాజ్, డుమిని, డికాక్‌లాంటి స్టార్ ఆటగాళ్లున్నా... వీళ్లందర్నీ మించి శ్రేయస్ పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన 13 మ్యాచ్‌ల్లో 419 పరుగులు చేశాడు.
 
 ఎనిమిదేళ్ల క్రితం ఐపీఎల్ మొదలైనప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఒకరిద్దరు యువ క్రికెటర్లు సంచలన ప్రదర్శనతో వెలుగులోకి వస్తూనే ఉన్నారు. జడేజా, యూసుఫ్ పఠాన్ సహా అనేకమంది క్రికెటర్లను భారత్‌కు ఐపీఎల్ అందించింది. అలాగే ఈ సీజన్‌లోనూ ఇద్దరు యువ క్రికెటర్లు అద్భుతాలు చేస్తున్నారు. ఢిల్లీ తరఫున ఆడుతున్న శ్రేయస్ అయ్యర్, ముంబైకి ఆడుతున్న హార్థిక్ పాండ్య చాలా తొంద రలోనే భారత జట్టు తలుపు తట్టే అవకాశం ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement