2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైనప్పటి నుంచి ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, అశ్విన్...
ఐపీఎల్ ఫ్రాంచైజీల డిమాండ్
ముంబై : 2008లో ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రారంభమైనప్పటి నుంచి ఎంఎస్ ధోని, విరాట్ కోహ్లి, సురేశ్ రైనా, అశ్విన్, మలింగ, హర్భజన్ సింగ్ తదితరులు ఆయా జట్ల తరఫునే ఆడుతూ వస్తున్న విషయం తెలిసిందే. వీరంతా రిటెన్షన్ పాలసీ ప్రకారం ఇన్నేళ్లుగా జట్లను మారకుండా ఆడుతున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే వీరంతా కూడా ఆటగాళ్ల వేలానికి అందుబాటులో ఉండే అవకాశం లేకపోలేదు.
తాజాగా గత వారం కొన్ని ఫ్రాంచైజీల యజమానులు... కొందరు ఆటగాళ్లను తమ దగ్గరే అట్టి పెట్టుకునే ఈ వెసులుబాటును వ్యతిరేకిస్తూ ఐపీఎల్ చైర్మన్ రాజీవ్ శుక్లా, బీసీసీఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్‌ను కలిశారు. ఈ పాలసీని సరిదిద్దాలని వారు డిమాండ్ చేశారు. 2014లో జరిగిన వేలంలో ఫ్రాంచైజీలు ఆటగాళ్లతో మూడేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఇందులోనే ఐదుగురు ఆటగాళ్లను అలాగే ఉంచుకోవడంతో పాటు ఆరో ఆటగాడిని ‘రైట్ టు మ్యాచ్’ ద్వారా పొందే అవకాశం కూడా జట్లకు కల్పించారు.
నిజానికి ఈ పద్ధతితో చెన్నై జట్టు బాగా లబ్ధి పొందింది. ఇప్పుడు బోర్డులో అధికారం మారడంతో పలు ఫ్రాంచైజీలు గళం విప్పాయి. 2008లో లీగ్ ప్రారంభమైనప్పుడు ప్రతీ ఆటగాడు మూడేళ్ల అనంతరం వేలానికి అందుబాటులో ఉంటాడని నిబంధనల్లో పేర్కొన్నారు. అయితే 2011లో నలుగురు ఆటగాళ్లను తమ జట్టు తరఫునే ఉంచుకోవచ్చనే నిబంధనను తెచ్చారు. ఒకవేళ ప్రస్తుత డిమాండ్‌ను బీసీసీఐ అంగీకరిస్తే టాప్ స్టార్స్ అంతా వేలంలో కనిపిస్తారు. కానీ చెన్నై, ముంబై, బెంగళూరు మాత్రం ఈ డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్నాయి.