
'సన్'కు మిల్లర్ స్ట్రోక్ తప్పింది
ఐపీఎల్-8లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఐపీఎల్-8లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు.. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ పై 5 పరుగుల తేడాతో విజయం సాధించింది. దీంతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి ఎగబాకి.. ప్లే ఆఫ్ అవకాశాల్ని పటిష్ఠం చేసుకుంది. పంజాబ్ బ్యాట్స్మన్ మిల్లర్ అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. 44 బంతుల్లో 9 సిక్సర్లు, రెండు ఫోర్లతో 89 పరుగులు చేశాడు. ఓక దశలో అసాధ్యమనిపించిన లక్ష్యాన్ని ఇట్టే సాధించినంత పనిచేశాడు. కానీ విజయం హైదరాబాద్ నే వరించింది.
ఓపెనర్లు మురళి విజయ్ (24), సాహా (20) కొద్దిసేపు మెరిసి ఔటయ్యారు. భారీ అంచనాలతో బరిలోకి దిగిన మ్యాక్స్ వెల్.. కేవలం 11 పరుగులకే పెవిలియన్ చేరాడు. చివర్లో ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ (15) కాసేపు మెరిశాడు. రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో వికెట్లు పడగొట్టడంలో హైదరాబాద్ బౌలర్లు సక్పెస్ అయ్యారు. హెన్రిక్స 3, బిపుల్ శర్మ 2, బౌల్ట్, భువనేశ్వర్ ఒక్కో వికెట్ తీశారు.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నసన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 185 పరుగులు చేసింది. 52 బంతుల్లో 81 పరుగులు చేసిన హైదరాబాద్ కెప్టెన్ వార్నర్.. టోర్నీలో అత్యధిక పరుగులు (504) సాధించి ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. శిఖర్ దావన్ (24), హెన్రిక్స్ (28) పరుగులతో రాణించారు. ఏడు బంతులు ఎదుర్కొన్న మోర్గాన్.. 17 పరుగులు చేసి ఔటయ్యాడు. చివర్లలో రాహుల్ (17), కరణ్ శర్మ (11) తెలివిగా పరుగులు రాబట్టారు. పంజాబ్ బౌలర్లలో హెండ్రిక్స్ రెండు, మాక్స్వెల్, గుర్కీరత్ లకు చెరో వికెట్ దక్కింది.