
'నేటి మ్యాచ్ మాకు ఫైనల్ తో సమానం'
గత మ్యాచ్ లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తో పోరాడి ఓడిన ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ ఆశలను క్లిష్టంగా మార్చుకుంది.
ముంబై: గత మ్యాచ్ లో బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్ తో పోరాడి ఓడిన ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ ఆశలను క్లిష్టంగా మార్చుకుంది. ఇప్పటికే చెన్నై సూపర్ కింగ్స్ ప్లే ఆఫ్ కు చేరగా, కోల్ కతా నైట్ రైడర్స్ మాత్రం లీగ్ దశను దాటడానికి ఒక్క మ్యాచ్ లో విజయం సాధిస్తే చాలు. ఈ క్రమంలో ముంబై-కోల్ కతాల మధ్య గురువారం నాటి మ్యాచ్ ఆసక్తికరంగా మారే అవకాశం ఉంది.
ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్ కోచ్ రికీ పాంటింగ్ మాట్లాడాడు. 'ఈ టోర్నమెంట్ లో నేటి మ్యాచ్ మాకు ఫైనల్ లాంటింది. డిఫెండింగ్ చాంపియన్ ను కోల్ కతాపై గెలవడానికి సన్నద్ధమవుతున్నాం. ఇక చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. వంద శాతం ఆటను ప్రదర్శిస్తామని పేర్కొన్నాడు.
పాయింట్ల పట్టికలో చెన్నై సూపర్ కింగ్స్ 16 పాయింట్లతో ప్లే ఆఫ్ బెర్త్ ను ఖరారు చేసుకోగా, కోల్ కతా 15 పాయింట్లతో ప్లే ఆఫ్ కు ఒక అడుగు దూరంలో ఉంది. మూడు, నాలుగు స్థానాల కోసం సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, బెంగళూర్ రాయల్ ఛాలెంజర్స్, ముంబై ఇండియన్స్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.