
లీడర్
చాన్నాళ్ల క్రితం తాను ఏదో రోజు ఆస్ట్రేలియా వన్డే జట్టుకు కెప్టెన్ అవుతానని, తనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని డేవిడ్ వార్నర్ బహిరంగంగా ప్రకటించాడు.
సాక్షి క్రీడావిభాగం : చాన్నాళ్ల క్రితం తాను ఏదో రోజు ఆస్ట్రేలియా వన్డే జట్టుకు కెప్టెన్ అవుతానని, తనలో నాయకత్వ లక్షణాలు ఉన్నాయని డేవిడ్ వార్నర్ బహిరంగంగా ప్రకటించాడు. కానీ ఆసీస్ దిగ్గజం షేన్‌వార్న్‌ను అమితంగా అభిమానించే వార్నర్, మైదానం బయట కూడా వార్న్‌ను ‘ఆదర్శం’గా తీసుకున్నాడు. ఫలితంగా వివాదాలు చుట్టుముట్టి కీలక సమయంలో కెప్టెన్సీ అవకాశాలు చేజార్చుకున్నాడు. అయితే బిగ్‌బాష్‌లో తాను కెప్టెన్‌గా వ్యవహరించిన ఏకైక మ్యాచ్‌లో సెంచరీతో సిడ్నీ జట్టును గెలిపించినప్పుడు మరోసారి తన కెప్టెన్సీ కోరికను బయటపట్టాడు. ఇది సన్‌రైజర్స్ యాజమాన్యం దృష్టికి కూడా వచ్చిందేమో వార్నర్‌పై నమ్మకం ఉంచి ఐపీఎల్-8 సీజన్ కోసం నాయకత్వ బాధ్యతలు అప్పగించింది.
బ్యాటింగ్‌లో హవా
సన్‌రైజర్స్ జట్టుకు తొలి సీజన్‌లో సంగక్కర, కామెరాన్ వైట్ కెప్టెన్లుగా వ్యవహరించారు. వీరిద్దరు బ్యాటింగ్‌లో ఘోరంగా విఫలమయ్యారు. గతేడాది ధావన్ సగం మ్యాచ్‌లు కెప్టెన్‌గా కాగా, తర్వాత స్యామీ వచ్చాడు. కెప్టెన్సీలో వీరిద్దరి ఆట కూడా దిగజారింది. అయితే ఈ సీజన్‌లో మాత్రం రైజర్స్ బ్యాటింగ్ మొత్తం కెప్టెన్ చుట్టే తిరుగుతోంది. 2014లో 14 మ్యాచ్‌లలో 528 పరుగులు చేసి లీగ్ టాప్‌స్కోరర్లలో ఒకడిగా నిలిచిన వార్నర్, ఈ సారి కూడా ఇప్పటికే 500 మార్క్ దాటాడు. అతని బ్యాటింగ్‌పై కెప్టెన్సీ ప్రభావం ఏ మాత్రం లేదనడానికి ఇదే సంకేతం.
అతను అర్ధ సెంచరీ చేసిన ఆరు మ్యాచ్‌లలో ఐదింటిలో సన్ గెలిచింది. దాదాపు 157 స్ట్రైక్‌రేట్‌తో వార్నర్ ఇచ్చే శుభారంభమే జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తోంది. బలహీనంగా కనిపిస్తున్న సన్ మిడిలార్డర్‌కు వార్నర్ ఓపెనింగే వెన్నెముకగా నిలుస్తోంది. ‘వైజాగ్‌లో జరిగిన ఒక మ్యాచ్‌లో ఆరు బంతుల వ్యవధిలో నాతో సహా మూడు వికెట్లు పడ్డాయి.
ఆ సమయంలో వికెట్ వద్ద నిలదొక్కుకొని ఆడాల్సిన నా బాధ్యత గుర్తుకొచ్చింది. కెప్టెన్సీ బాధ్యతలు గుర్తున్నా బ్యాటింగ్ చేసే సమయంలో నా శైలిలోనే ఆడతాను. అలా ఆడితేనే పరుగులు చేయగలను. ప్రతీ మ్యాచ్‌కు ఆడాల్సిన తీరుతో పాటు పిచ్ కూడా మారుతుంది. దానికనుగుణంగా నేను మారతాను’ అని తన బ్యాటింగ్ గురించి వార్నర్ విశ్లేషించాడు.
కొత్త వ్యూహాలతో...
‘2014లో కెప్టెన్ కాకపోయినా జట్టు వ్యూహాల్లో దూసుకుపోయే తత్వం, అతని చురుకుదనం చూసిన తర్వాతే ఈ సారి కెప్టెన్‌గా చేయాలని నిర్ణయించాం. ప్రతీ సమావేశంలో అతను కీలక సూచనలిచ్చేవాడు. ఈ సారి మరింత బాధ్యతగా వ్యవహరిస్తున్నాడు. ఆటగాడిగానే కాకుండా వ్యక్తిగా కూడా వార్నర్ చాలా పరిణతి చెందాడు’... తమ కెప్టెన్ గురించి సన్‌రైజర్స్ మెంటర్ వీవీఎస్ లక్ష్మణ్ చేసిన వ్యాఖ్య ఇది.
తగిన సమయంలో సేవలు ఉపయోగించుకుంటాం....లాంటి ఉపన్యాసాలు ఇవ్వకుండా స్టెయిన్ అవసరం ఇప్పుడు తమకు లేదంటూ వార్నర్ నిష్కర్షగా చెప్పడం అందరినీ ఆశ్చర్యపరచింది. జట్టుకు విదేశీ బ్యాట్స్‌మెన్ అవసరం కావడంతో ఒక మ్యాచ్‌లో స్టెయిన్, బౌల్ట్ ఇద్దరినీ బయటకూర్చోబెట్టే సాహసం చేశాడు. ముఖ్యంగా రాజస్థాన్, ఢిల్లీలతో మ్యాచ్‌లలో అతని ప్రణాళికలు అద్భుతంగా ఫలించాయి. వరుసగా విఫలమైనా మోర్గాన్, హెన్రిక్స్‌లపై అతను నమ్మకముంచాడు.
కీలక సమయంలో వీరిద్దరు ఫామ్‌లోకి రావడం జట్టుకు కలిసొచ్చింది. హెన్రిక్స్‌ను టాప్ ఆర్డర్‌లోకి ప్రమోట్ చేయడం కూడా తన ఆలోచనే. వార్నర్ బాధ్యత ఇంతటితో ముగిసిపోలేదు. ప్లేఆఫ్‌కే కాదు...ఆ తర్వాత కూడా సన్‌రైజర్స్‌కు టైటిల్ అందించడమే అతను లక్ష్యంగా పెట్టుకున్నాడు. మరి వార్న్, గిల్లీల బాటలో మరో ఆస్ట్రేలియన్ ఐపీఎల్ ట్రోఫీ గెలిపించగలడా చూడాలి!
మైదానంలోకి దిగాక తొలి బంతినుంచే దూకుడు.... మెరుపు షాట్లతో జట్టుకు శుభారంభం... టోర్నీలో ఏకంగా ఆరు అర్ధ సెంచరీలు, ఐదు వందలకు పైగా పరుగులు... బ్యాట్స్‌మన్‌గా డేవిడ్ వార్నర్ విలువేమిటో చెప్పేందుకు ఇది చాలు. ప్రపంచ నంబర్‌వన్ బౌలర్‌ను మొహమాటం లేకుండా తప్పించాలంటే... అద్భుత ఫామ్‌లో ఉన్న బౌలర్‌ను డగౌట్‌లో కూర్చోబెట్టాలంటే... ఎంతో ధైర్యం కావాలి. ఓటమి ఎదురైతే విమర్శలకు సమాధానం చెప్పాలి. వార్నర్ అందుకు వెనుకాడలేదు. తనదైన వ్యూహాలతో సన్‌రైజర్స్‌ను ప్లేఆఫ్‌కు చేరువ చేశాడు.