
ధోనీకి జరిమానా
న్యూఢిల్లీ: చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్, కీపర్ మహేంద్ర సింగ్ ధోనీకి జరిమానా విధించారు. ఐపీఎల్-8 లో భాగంగా మంగళవారం రాత్రి ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్ ఓటమి అనంతరం అంపైర్ల నిర్ణయాలపై కామెంట్లు చేసినందుకు మ్యాచ్ ఫీజులో 10 శాతం కోత విధించారు. ఎప్పుడూ వివాదాలకు దూరంగా నిలిచే మహేంద్రుడు ముంబైతో మ్యాచ్ అనంతరం మాత్రం తన అసహనాన్ని వ్యక్తం చేసి జరిమానాకు గురవడం విశేషం.
చెన్నై ఓపెనర్ డ్వేన్ స్మిత్ ముంబై ఇండియన్స్ బౌలర్ మలింగ బౌలింగలో అవుటయినట్లు ఇచ్చిన అంపైర్ల నిర్ణయాన్ని ధోనీ తప్పుబట్టాడు. రిప్లేలో చూసినట్లయితే ఆ బంతి లెగ్ సైడ్ కు దూరంగా వెళ్తోన్నట్లు స్పష్టంగా కనిపించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం స్మిత్ ను ఔట్ అని ప్రకటించడాన్ని తప్పుపడుతూ ధోనీ ఈ కామెంట్ చేశాడు. బుధవారం రాజస్థాన్ రాయల్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లలో గెలిచిన టీమ్తో శుక్రవారం క్వాలిఫయర్-2 మ్యాచ్ ఆడనుంది. అయితే ఈ మ్యాచ్ ధోనీ సొంత గ్రౌండ్ రాంఛీలో జరగనుండటం చెన్నైకి కలిసొచ్చే అంశం. మంగళవారం జరిగిన మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ ని 25 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ చిత్తు చేసిన విషయం తెలిసిందే.