
వారెవ్వా... రాజస్తాన్
♦ ప్లే ఆఫ్‌కు రాయల్స్ అర్హత
♦ వాట్సన్ అద్భుత సెంచరీ
♦ కోల్‌కతా అవకాశాలు సంక్లిష్టం
ముంబై : ప్లే ఆఫ్‌కు చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ దుమ్మురేపింది. తమకంటే ప్రత్యర్థి జట్టు పటిష్టంగా ఉన్నా... ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. షేన్ వాట్సన్ (59 బంతుల్లో 104 నాటౌట్; 9 ఫోర్లు, 5 సిక్సర్లు) వీరోచిత సెంచరీకి తోడు రహానే (22 బంతుల్లో 37; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) సమయోచితంగా ఆడటంతో శనివారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో రాజస్తాన్ 9 పరుగుల తేడాతో కోల్‌కతాపై నెగ్గి ప్లే ఆఫ్ బెర్త్ ఖరారు చేసుకుంది.
బ్రబౌర్న్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో... ముందుగా రాజస్తాన్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 199 పరుగులు చేసింది. టాప్ ఆర్డర్‌లో వాట్సన్, రహానే మినహా మిగతా వారు విఫలమయ్యారు. తర్వాత కోల్‌కతా 20 ఓవర్లలో 9 వికెట్లకు 190 పరుగులకే పరిమితమైంది. యూసుఫ్ పఠాన్ (35 బంతుల్లో 44; 5 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్. రస్సెల్ (20 బంతుల్లో 37; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించాడు.
వాట్సన్ హవా...
టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన రాజస్తాన్ ఇన్నింగ్స్‌కు వాట్సన్ వెన్నెముకగా నిలిచాడు. కోల్‌కతా బౌలర్లపై భారీ షాట్లతో విరుచుకుపడుతూ రహానేతో కలిసి మెరుపు ఆరంభాన్నిచ్చాడు. దీంతో తొలి వికెట్‌కు 80 పరుగులు సమకూరాయి. వన్‌డౌన్‌లో స్మిత్ (14) నిరాశపర్చినా.. వాట్సన్ జోరుకు రన్‌రేట్ 10కి పైగా నమోదైంది. ఫలితంగా తొలి 10 ఓవర్లలో రాజస్తాన్ ఒక వికెట్‌కు కోల్పోయి 107 పరుగులు చేసింది. ఈ దశలో రస్సెల్.... రాజస్తాన్ ఇన్నింగ్స్ జోరుకు కాస్త అడ్డుకట్ట వేశాడు.
వరుసగా నాలుగు ఓవర్లు వేసిన అతను... క్రమం తప్పకుండా స్మిత్, శామ్సన్ (8), ఫాల్క్‌నర్ (6)ల వికెట్లు తీశాడు. దీంతో 15 ఓవర్లు ముగిసేసరికి జట్టు స్కోరు 146/4గా మారింది. కరుణ్ నాయర్ (16)తో కలిసి చివర్లో వాట్సన్ మళ్లీ బ్యాట్ ఝళిపించడంతో పరుగుల వరద పారింది. ఈ ఇద్దరు ఐదో వికెట్‌కు 40 పరుగులు జోడించాడు. ఈ క్రమంలో 57 బంతుల్లో సెంచరీ పూర్తి చేసిన వాట్సన్.. మోరిస్ (4)తో కలిసి ఆరో వికెట్‌కు 19 పరుగులు సమకూర్చాడు.
యూసుఫ్ మినహా...
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కోల్‌కతాకు సరైన ఆరంభం లభించలేదు. ఓపెనర్లు ఉతప్ప (14), గంభీర్ (1) స్వల్ప స్కోరుకే అవుటయ్యారు. తర్వాత మనీష్ పాండే (21 బంతుల్లో 21; 3 ఫోర్లు) సాయంతో యూసుఫ్ ఇన్నింగ్స్‌ను పునర్‌నిర్మించాడు. కానీ స్మిత్.. బౌలర్లను మార్చిమార్చి ప్రయోగించడంతో మూడో వికెట్‌కు 56 పరుగులు జోడించాక పాండే వెనుదిరిగాడు. ఈ దశలో రస్సెల్ భారీ హిట్టింగ్‌తో విరుచుకుపడ్డాడు. యూసుఫ్‌తో కలిసి నాలుగో వికెట్‌కు 55 పరుగులు జోడించాడు.
అయితే మూడు బంతుల తేడాలో రస్సెల్, సూర్యకుమార్ (0)లతో పాటు కొద్దిసేపటికే యూసుఫ్ కూడా అవుట్‌కావడంతో కోల్‌కతా కోలుకోలేకపోయింది. చివర్లో షకీబ్ (13), ఉమేశ్ (11 బంతుల్లో 24 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) దడదడలాడించాడు. అయితే గెలుపునకు 12 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన దశలో కోల్‌కతా 26 పరుగులు మాత్రమే చేసి ఓడింది. మోరిస్ 4 వికెట్లు తీశాడు.
మిగతా రెండు బెర్త్‌ల కోసం...
ఈ మ్యాచ్‌లో విజయంతో రాజస్తాన్ 16 పాయింట్లతో ప్లే ఆఫ్‌కు చేరుకుంది. 15 పాయింట్లతో ఉన్న కోల్‌కతా అవకాశాలు దాదాపుగా మూసుకుపోయాయి. ఇక ఆదివారం తన ఆఖరి మ్యాచ్‌లో బెంగళూరు... ఢిల్లీపై గెలిస్తే సమీకరణాలతో అవసరం లేకుండా ప్లే ఆఫ్‌కు అర్హత పొందుతుంది. ఒకవేళ భారీ తేడాతో ఢిల్లీ గెలిస్తే మాత్రం కోల్‌కతాకు స్వల్ప అవకాశం ఉంటుంది. అయితే రన్‌రేట్‌లో ఆర్‌సీబీని కోల్‌కతా అధిగమించాలి. సన్‌రైజర్స్, ముంబైల్లో గెలిచిన జట్టు ప్లే ఆఫ్‌కు అర్హత సాధిస్తుంది.
స్కోరు వివరాలు
రాజస్తాన్ రాయల్స్ ఇన్నింగ్స్ : రహానే రనౌట్ 37; వాట్సన్ నాటౌట్ 104; స్మిత్ (సి) మోర్కెల్ (బి) రస్సెల్ 14; శామ్సన్ (సి) గంభీర్ (బి) రస్సెల్ 8; ఫాల్క్‌నర్ (సి) సూర్యకుమార్ (బి) రస్సెల్ 6; కరుణ్ నాయర్ (సి) ఉతప్ప (బి) ఉమేశ్ 16; మోరిస్ రనౌట్ 4; ఎక్స్‌ట్రాలు 10; మొత్తం: (20 ఓవర్లలో 6 వికెట్లకు) 199.
వికెట్ల పతనం : 1-80; 2-110; 3-122; 4-140; 5-180; 6-199.
బౌలింగ్ : అజర్ మహమూద్ 3-0-41-0; మోర్కెల్ 4-0-38-0; ఉమేశ్ 4-0-36-1; షకీబ్ 4-0-36-0; రస్సెల్ 4-0-32-3; చావ్లా 1-0-12-0.
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఇన్నింగ్స్ : ఉతప్ప (సి) స్మిత్ (బి) కులకర్ణి 14; గంభీర్ (సి) బిన్నీ (బి) మోరిస్ 1; మనీష్ (సి) మోరిస్ (బి) కులకర్ణి 21; యూసుఫ్ (సి) కులకర్ణి (బి) వాట్సన్ 44; రస్సెల్ (సి) కులకర్ణి (బి) మోరిస్ 37; సూర్యకుమార్ (సి) శామ్సన్ (బి) మోరిస్ 0; షకీబ్ (సి) స్మిత్ (బి) మోరిస్ 13; అజర్ (సి) రహానే (బి) ఫాల్క్‌నర్ 6; చావ్లా (సి) బిన్నీ (బి) వాట్సన్ 0; ఉమేశ్ నాటౌట్ 24; మోర్కెల్ నాటౌట్ 4; ఎక్స్‌ట్రాలు 26; మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 190.
వికెట్ల పతనం : 1-8; 2-21; 3-77; 4-132; 5-133; 6-146; 7-156; 8-159; 9-184.
బౌలింగ్ : మోరిస్ 4-0-23-4; బ్రెండర్ స్రాన్ 3-0-35-0; ధవల్ కులకర్ణి 4-0-36-2; ఫాల్క్‌నర్ 4-0-45-1; వాట్సన్ 4-0-38-2; బిన్నీ 1-0-10-0.