
చెన్నై విజయలక్ష్యం 140
రాంచీ: ఐపీఎల్-8లో భాగంగా ఇక్కడ చెన్నై సూపర్ కింగ్స్ తో జరుగుతున్న క్వాలిఫయర్ -2 మ్యాచ్ లో బెంగళూర్ రాయల్ చాలెంజర్స్ 140 పరుగుల విజయలక్ష్యాన్ని ప్రత్యర్థికి నిర్దేశించింది. టాస్ గెలిచిన చెన్నై తొలుత బెంగళూర్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. దీంతో బ్యాటింగ్ చేపట్టిన బెంగళూర్ ఆదిలోనే కెప్టెన్ విరాట్ కోహ్లీ(12) ను కోల్పోయింది.అనంతరం వెంటనే ఏబీ డివిలియర్స్ (1)పెవిలియన్ కు చేరడంతో బెంగళూర్ ఒక్కసారిగా కష్టాల్లో పడింది. బెంగళూర్ 36 పరుగుల వద్ద ఉండగా మన్ దీప్(4)ను నష్టపోవడంతో జట్టు స్కోరు మందగించింది. అయితే క్రిస్ గేల్ కాసేపు మెరుపులు మెరిపించడంతో బెంగళూర్ మధ్యలో పుంజుకుంది.గేల్(41) బ్యాట్ వేగం పెంచే క్రమంలో రైనా బౌలింగ్ లో పెవిలియన్ కు చేరాడు.
ఆ తరువాత దినేష్ కార్తీక్ కు జతకలిసిన సర్ఫరాజ్ ఇన్నింగ్స్ ను మరమ్మత్తులు చేసే పనిలో పడ్డాడు. కాగా, దినేశ్ కార్తీక్(28) భారీ షాట్ కు యత్నించి నెహ్రా బౌలింగ్ లో అవుటైయ్యాడు. ఆ తరుణంలో సర్ఫరాజ్(31) ఆదుకోవడంతో బెంగళూర్ నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో నెహ్రా మూడు వికెట్లు తీయగా, మోహిత్ శర్మ, రైనా, అశ్విన్ ,బ్రేవోలకు తలో వికెట్ దక్కింది.