బెంగళూరు:ఐపీఎల్‌లో భాగంగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 188 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై ఆటగాళ్లలో డీకాక్(23;20 బంతుల్లో 2 ఫోర్లు, 1 సిక్సర్), రోహిత్ శర్మ(48;33 బంతుల్లో 8 ఫోర్లు, 1సిక్సర్), సూర్యకుమార్ యాదవ్(38; 24 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్), యువరాజ్ సింగ్(23; 12 బంతుల్లో 3 సిక్సర్లు), హార్దిక్(32 నాటౌట్; 14 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు)లు సమయోచితంగా బ్యాటింగ్ చేశారు. ఆర్సీబీ బౌలర్ చహల్ స్పిన్ మ్యాజిక్‌తో ముంబైను కట్టడి చేశాడు. నాలుగు వికెట్లు సాధించి ముంబై బ్యాటింగ్ ఆర్డర్‌ను దెబ్బకొట్టాడు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు డీకాక్-రోహిత్‌లు శుభారంభం అందించారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించిన తర్వాత డీకాక్ ఔటయ్యాడు. ఆపై ఇన్నింగ్స్ తనదైన షాట్లతో అలరించాడు. ఎనిమిది ఫోర్లు , సిక్సర్ సాయంతో 48 పరుగులు సాధించిన రోహిత్ తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోయాడు. అటు తర్వాత సూర్యకుమార్-యువరాజ్ సింగ్ జోడి స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ముఖ్యంగా చహల్ బౌలింగ్‌లో యువీ కొట్టిన హ్యాట్రిక్ సిక్స్‌లు మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి.
అయితే యువీ-సూర్యకుమార్‌లు 18 పరుగుల వ్యవధిలో ఔట్ కావడంతో ముంబై ఇండియన్స్ స్కోరులో వేగం తగ్గింది. వీరిద్దర్నీ చహల్ వేర్వేరు ఓవర్లలో పెవిలియన్‌కు పంపాడు. ఆపై చహల్ వేసిన మరుసటి ఓవర్‌లో పొలార్డ్(5) కూడా ఔట్ కావడంతో ముంబై 145 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను కోల్పోయింది.మరో రెండు పరుగుల వ్యవధిలో కృనాల్ పాండ్యా(1), మెక్లీన్‌గాన్(1)లు పెవిలియన్ చేరడంతో ఆర్సీబీ శిబిరంలో ఆనందం వెల్లివిరిసింది. కాగా, చివర్లో హార్దిక్ పాండ్యా మెరుపులు మెరిపించడంతో ముంబై నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. చహల్ జతకు ఉమేశ్ యాదవ్, సిరాజ్‌లు తలో రెండు వికెట్లు తీశారు.
Comments
Please login to add a commentAdd a comment