
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో భాగంగా ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 195 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ముంబై ఓపెనర్లు ఎవిన్ లూయిస్(48; 28 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్(53;32 బంతుల్లో 7ఫోర్లు 1 సిక్స్) కీలక ఇన్నింగ్స్ సాధించడంతో ముంబై భారీ స్కోరు సాధించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన ముంబైకు శుభారంభం లభించింది. తొలి వికెట్‌కు ముంబై ఓపెనర్లు సూర్యకుమార్ యాదవ్, ఎవిన్ లూయిస్‌లు 102 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించారు. దాంతో ముంబై తరపున ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగుల భాగస్వామ్యాన్ని జత చేసిన ఓపెనింగ్ జోడిగా గుర్తింపు పొందారు. తొలి వికెట్‌గా లూయిస్ అవుటైన స‍్వల్ప వ్యవధిలో సూర్యకుమార్ యాదవ్ రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. వీరిద్దరూ ఏడు పరుగుల వ్యవధిలో అవుటయ్యారు. మరొకవైపు ఇషాన్ కిషన్(44; 23 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించాడు. అయితే మిడిల్ ఆర్డర్‌లో ముంబై విఫలం కావడంతో రెండొందల మార్కును చేరడంలో విఫలమైంది.
ముంబై మిడిల్ ఆర్డర్ ఆటగాళ్లలో కీరోన్ పొలార్డ్ డకౌట్ కాగా, రోహిత్ శర్మ(18), కృనాల్ పాండ్యా(11), హార్దిక్ పాండ్యా(4)లు తీవ్రంగా నిరాశపరిచారు. పవర్ ప్లేలో భారీగా పరుగులు సమర్పించుకున్న ఢిల్లీ.. ఆపై కట్టుదిట్టంగా బౌలింగ్ చేసింది. దాంతో తొలి ఆరు ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 84 పరుగులు చేసిన ముంబై.. మిగతా 14 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 110 పరుగులు మాత్రమే చేసింది. ఢిల్లీ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, డానియల్ క్రిస్టియన్, రాహుల్ తెవాతియాలు తలో రెండు వికెట్లు సాధించగా, మహ్మద్ షమీకి వికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment