రేసులో నిలిచారు
ముంబై మరో విజయం
ఢిల్లీకి వరుసగా ఎనిమిదో ఓటమి
హస్సీ అర్ధ సెంచరీ
ముంబై: ప్లే ఆఫ్ రేసులో నిలవాలంటే తమకు మిగిలిన రెండు మ్యాచ్‌లను తప్పక గెలవాల్సిన పరిస్థితిలో ముంబై ఓ అడుగు ముందుకేసింది. మైక్ హస్సీ (33 బంతుల్లో 56; 7 ఫోర్లు; 2 సిక్సర్లు) మెరుపులకు తోడు లెండిల్ సిమ్మన్స్ (25 బంతుల్లో 35; 5 ఫోర్లు) నిలకడ తోడవ్వడంతో శుక్రవారం వాంఖడే మైదానంలో ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌ను 15 పరుగుల తేడాతో నెగ్గింది. ఓదశలో 12 ఓవర్లలోనే 120 పరుగులు సాధించిన ముంబైని డేర్‌డెవిల్స్ బౌలర్లు కట్టడి చేసినా... ఢిల్లీ బ్యాట్స్‌మెన్ సద్వినియోగం చేసుకోలేకపోయారు. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు మైక్ హస్సీకి దక్కింది. అటు రాజస్థాన్ జట్టు పంజాబ్ చేతిలో ఓడిపోవడంతో ముంబైకి అవకాశాలు మిగిలాయి.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రోహిత్ సేన 19.3 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్లు హస్సీ, సిమ్మన్స్ వేగంగా ఆడడంతో తొలి వికెట్‌కు 87 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత రోహిత్ శర్మ (21 బంతుల్లో 30; 4 ఫోర్లు) ఒక్కడే కాస్త మెరుగ్గా ఆడాడు. మిడిల్ ఓవర్లలో ఢిల్లీ బౌలర్ల ఆధిపత్యం ముందు ముంబై తేలిపోయింది. స్పిన్నర్ తాహిర్‌కు మూడు వికెట్లు దక్కాయి.
అనంతరం బరిలోకి దిగిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 158 పరుగులు చేసి ఓడింది. కెప్టెన్ పీటర్సన్ (31 బంతుల్లో 44; 6 ఫోర్లు; 1 సిక్స్) తమ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించాడు. మనోజ్ తివారి (31 బంతుల్లో 41; 5 ఫోర్లు; 1 సిక్స్), డుమిని (29 బంతుల్లో 45 నాటౌట్; 4 సిక్సర్లు) తమ ఆటతీరుతో విజయంపై కాస్త ఆశ రేకెత్తించారు. అయితే 19వ ఓవర్‌లో డి లాంజ్.. తివారిని అవుట్ చేయడంతో ముంబై ఊపిరి పీల్చుకుంది. డి లాంజ్‌కు రెండు వికెట్లు దక్కాయి.
స్కోరు వివరాలు
ముంబై ఇండియన్స్ ఇన్నింగ్స్: సిమ్మన్స్ (సి) పార్నెల్ (బి) తాహిర్ 35; హస్సీ (రనౌట్) 56; రోహిత్ (బి) ఉనాద్కట్ 30; పొలార్డ్ (సి) కార్తీక్ (బి) ఉనాద్కట్ 11; రాయుడు (సి) విజయ్ (బి) నదీమ్ 2; తారే (సి) జాదవ్ (బి) తాహిర్ 14; హర్భజన్ (సి) విజయ్ (బి) పార్నెల్ 2; గోపాల్ (రనౌట్) 11; డి లాంజ్ (సి) కార్తీక్ (బి) తాహిర్ 1; ఓజా (రనౌట్) 2; బుమ్రా నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (19.3 ఓవర్లలో ఆలౌట్) 173.
వికెట్ల పతనం: 1-87; 2-120; 3-140; 4-141; 5-151; 6-157; 7-161; 8-168; 9-171; 10-173.
బౌలింగ్: పార్నెల్ 3.3-0-26-1; కౌల్ 2-0-21-0; ఉనాద్కట్ 2-0-24-2; నదీమ్ 4-0-28-1; డుమిని 4-0-31-0; తాహిర్ 4-0-37-3.
ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: విజయ్ (స్టంప్డ్) తారే (బి) గోపాల్ 8; పీటర్సన్ (బి) హర్భజన్ 44; దినేశ్ కార్తీక్ (బి) డి లాంజ్ 7; తివారి (సి) హస్సీ (బి) డి లాంజ్ 41; డుమిని నాటౌట్ 45; జాదవ్ నాటౌట్ 7; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (20 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 158.
వికెట్ల పతనం: 1-43; 2-59; 3-61; 4-146.
బౌలింగ్: బుమ్రా 4-0-36-0; డి లాంజ్ 4-0-32-2; ఓజా 4-0-33-0; గోపాల్ 3-0-20-1; హర్భజన్ 4-0-30-1; పొలార్డ్ 1-0-4-0.