నన్ను అనుమతించండి | N. Srinivasan Acted Against Guilty Player: BCCI Tells Supreme Court | Sakshi
Sakshi News home page

నన్ను అనుమతించండి

Published Sat, Nov 22 2014 12:41 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM

నన్ను అనుమతించండి - Sakshi

నన్ను అనుమతించండి

బీసీసీఐ అధ్యక్ష పదవిపై సుప్రీంకు శ్రీనివాసన్ అభ్యర్థన
 
 న్యూఢిల్లీ: స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ ఆరోపణలపై జస్టిస్ ముకుల్ ముద్గల్ కమిటీ క్లీన్‌చిట్ ఇచ్చినందున.... బీసీసీఐ అధ్యక్ష పదవి చేపట్టేందుకు తనకు అనుమతి ఇవ్వాలని ఎన్.శ్రీనివాసన్ సుప్రీం కోర్టును అభ్యర్థించారు. అలాగే కమిటీ నివేదికలోని అభ్యంతరాలపై ఆయన శుక్రవారం అఫిడవిట్ దాఖలు చేశారు. ‘ప్యానెల్ పరిశోధన పూర్తయ్యింది. దాంట్లో ఎలాంటి నేరారోపణలు నాపై లేవు. నేను అమాయకుడిని. నాపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని స్పష్టంగా తెలిసిపోయింది. అందుకే ఇప్పుడు కూడా బీసీసీఐ అధ్యక్ష బాధ్యతలకు దూరంగా ఉండడంలో ఎలాంటి అర్థం లేదు.

ఇప్పటికే పస లేని ఆరోపణలతో దాదాపు ఏడాది కాలంగా పదవికి దూరంగా ఉన్నాను. తిరిగి నేను అధ్యక్షుడిగా కొనసాగేలా అనుమతి ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇక నివేదికలో ఓ క్రికెటర్ తప్పు చేసినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలిపిన విషయం చాలా చిన్నది. అది నాపై నేరారోపణ చేసినట్టు కాదు’ అని ఐసీసీ చైర్మన్‌గా కొనసాగుతున్న శ్రీనివాసన్ అన్నారు.

స్పాట్ ఫిక్సింగ్, బెట్టింగ్ స్కాంపై విచారణ పారదర్శకంగా కొనసాగేలా.. బోర్డు అధ్యక్షుడిగా ఎన్నికైన శ్రీనిని తప్పుకోవాలని ఈ ఏడాది మార్చిలో సుప్రీం ఆదేశించింది. మరోవైపు వచ్చే నెల 17న జరిగే బీసీసీఐ ఏజీఎంకు ముందే అధ్యక్ష పదవి చేపట్టేందుకు శ్రీనివాసన్ ఆసక్తి చూపుతున్నారు. ఈస్ట్ జోన్ మద్దతుతో మరో దఫా ఈ పదవిలో కొనసాగేందుకు శ్రీని పావులు కదుపుతున్నారు.

‘సీఎస్‌కేను రద్దు చేయొద్దు’
ఐపీఎల్ నుంచి చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కు ఉద్వాసన పలికేలా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఇండియా సిమెంట్స్ సుప్రీం కోర్టును కోరింది. ఆ టీమ్ ప్రిన్సిపల్‌గా ఉన్న గురునాథ్ మెయ్యప్పన్ బెట్టింగ్‌కు పాల్పడ్డాడని ముద్గల్ కమిటీ నివేదికలో పేర్కొన్న విషయం తెలిసిందే. దీంతో లీగ్ నిబంధనల ప్రకారం సీఎస్‌కే ఫ్రాంచైజీని రద్దు చేయాల్సి ఉంటుంది.

‘ఐపీఎల్‌లో సీఎస్‌కే చాలా ప్రాముఖ్యమైన జట్టు. చెన్నై ఆటగాళ్లకు విపరీతమైన ప్రేక్షకాదరణ ఉంది. ఇలాంటి నేపథ్యంలో ఈ జట్టును పక్కకు తప్పిస్తే అది ఒక్క సీఎస్‌కేకే కాకుండా మొత్తం ఐపీఎల్‌లోనే తీవ్ర పర్యవసానాలకు దారి తీస్తుంది. అసలు గురునాథ్ ఈ జట్టు భాగస్వామి కాదు.. డెరైక్టర్, కంపెనీ ఉద్యోగి కూడా కాదు. ఐపీఎల్ నిబంధనల ప్రకారం ఫ్రాంచైజీకి చెందిన కంపెనీ లేక యజమాని మాత్రమే అనైతిక కార్యకలాపాలకు పాల్పడితే జట్టు రద్దు అవుతుంది’ అని ఇండియా సిమెంట్స్ పేర్కొంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement