సాక్షి, గుంటూరు: 1, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0, 0 ఈ అంకెలేంటా అని ఆశ్చర్యపోతున్నారా... ఇవి ఓ క్రికెట్ మ్యాచ్‌లో బ్యాట్స్‌మెన్ వరుసగా నమోదు చేసిన స్కోర్లు! మొత్తం పదకొండు మంది కలిసి చేసింది ఒకే ఒక్క పరుగైతే మరో అదనపు పరుగుతో కలుపుకొని జట్టు మొత్తం స్కోరు రెండు. ఈ పరుగులు చేయడానికి ఆ టీం ఆడిన ఓవర్లు 17. అందులో 16 మెయిడిన్లు. క్రీజులోకి వచ్చిన తొమ్మిది మంది ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగారు. ప్రత్యర్థి జట్టు బౌలర్లలో ఒక్కరు తప్ప మిగిలిన నలుగురు ఒక్కటంటే ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. ఈ స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడానికి ప్రత్యర్థి జట్టుకు కేవలం ఒక్క బంతి సరిపోయింది.
ఇవేవో గల్లీ క్రికెట్‌లో నమోదైన గణాంకాలు కావు. బీసీసీఐ అధికారికంగా నిర్వహిస్తున్న మహిళల జాతీయ అండర్–19 సూపర్ లీగ్ మ్యాచ్‌లోనివి. జేకేసీ కళాశాల మైదానంలో నాగాలాండ్–కేరళ జట్ల మధ్య శుక్రవారం జరిగిన 50 ఓవర్ల మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన నాగాలాండ్ జట్టు 17 ఓవర్లలో రెండు పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్ మేనక ఓ పరుగు చేయగా.. మరో పరుగు వైడ్ రూపంలో లభించింది. మిగిలిన పది మంది సున్నాతో సరిపెట్టారు. కేరళ బౌలర్లలో కెప్టెన్ మిన్ను మణి 4, సౌరభ్య 2 వికెట్లతో నాగాలాండ్ వెన్ను విరిచారు.
మూడు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన కేరళ జట్టు తొలి బంతికే విజయాన్ని సొంతం చేసుకుంది. నాగాలాండ్ బౌలర్ దీపిక వేసిన తొలి బంతి వైడ్‌గా వెళ్లింది. ఆ మరుసటి బంతిని అన్సు ఫోర్ కొట్టడంతో.. ఆట పూర్తైంది. క్రికెట్ చరిత్రలో ఒక్క బంతికే లక్ష్యాన్ని ఛేదించడంతో పాటు అతి తక్కువ సమయం సాగిన మ్యాచ్ కూడా ఇదే కావడం విశేషం. ఇటీవల ఇదే టోర్నీలో మేఘాలయ జట్టు 17 పరుగులకే కుప్పకూలింది. బిహార్, సిక్కిం జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో సిక్కిం 18 పరుగులకే ఆలౌటై చెత్త ప్రదర్శన నమోదు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment