నందగోపాల్, మేఘన ‘డబుల్’
రెండేసి టైటిల్స్ నెగ్గిన హైదరాబాద్ ప్లేయర్స్ ∙
సింగిల్స్ చాంప్ రోహిత్ యాదవ్
సాక్షి, హైదరాబాద్: అఖిల భారత సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలుగు క్రీడాకారులు సత్తా చాటారు. ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీలో ముగిసిన ఈ టోర్నీలో హైదరాబాద్‌కు చెందిన కిడాంబి నందగోపాల్, మేఘన జక్కంపూడి చెరో రెండు టైటిళ్లను కైవసం చేసుకోగా.... రోహిత్ యాదవ్ పురుషుల సింగిల్స్ విభాగంలో చాంపియన్‌గా నిలిచాడు. మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో జోడీగా టైటిల్‌ను గెలిచిన నందగోపాల్– మేఘనలు... మహిళల, పురుషుల డబుల్స్ విభాగాల్లో తమ భాగస్వాములతో కలిసి విజేతలుగా నిలిచారు.
మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లో కె. నందగోపాల్ (సీఏజీ)– మేఘన జక్కంపూడి (ఏఐ) ద్వయం 21–16, 21–11తో సాన్యమ్ శుక్లా–సంయోగిత (ఏఐ) జంటను చిత్తుగా ఓడించి తొలి టైటిల్‌ను గెలుచుకుంది. పురుషుల డబుల్స్ విభాగంలో నందగోపాల్–సాన్యమ్ శుక్లా జంట 21–16, 14–21, 21–11తో అరుణ్ జార్జి (కేరళ)–శివమ్ శర్మ (యూపీ) జోడీపై.... మహిళల డబుల్స్ విభాగంలో మేఘన–పూర్వీషా (కర్ణాటక) జంట 21–12, 21–17తో కుహూ గార్గ్–నింగ్షి బ్లాక్ హజారికా జోడీపై గెలుపొందడంతో ఇద్దరి ఖాతాలో మరో టైటిల్ చేరింది. మరోవైపు పురుషుల సింగిల్స్ విభాగంలో రోహిత్ యాదవ్ (ఏఏఐ) 21–17, 21–16తో హర్షిత్ అగర్వాల్ (ఏఐ)ను ఓడించి విజేతగా నిలిచాడు. మహిళల సింగిల్స్ విభాగంలో అరుంధతి (మహారాష్ట్ర) 21–14, 14–21, 21–16తో శ్రీయాన్షి పరదేశి (మధ్యప్రదేశ్)పై గెలుపొందింది.