సాక్షి, హైదరాబాద్: ఆలిండియా సీనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో తెలంగాణ ప్లేయర్లు నందగోపాల్, మనీషా సత్తా చాటారు. కొచ్చిలో జరిగిన ఈ టోర్నీ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో జోడీగా బరిలోకి దిగిన వీరిద్దరూ టైటిల్‌ను కైవసం చేసుకున్నారు. టైటిల్ పోరులో ఆరోసీడ్ నందగోపాల్ (కాగ్)–మనీషా (ఆర్‌బీఐ) ద్వయం 21–14, 21–13తో సనావే థామస్ (కేరళ)–అపర్ణ బాలన్ (పెట్రోలియం) జంటపై 35 నిమిషాల్లోనే గెలుపొందింది. అంతకుముందు జరిగిన సెమీఫైనల్లో నందగోపాల్–మనీషా జంట 21–6, 21–10తో టాప్‌సీడ్ వెంకట్ గౌరవ్ ప్రసాద్–జూహీ దేవాంగన్ (ఛత్తీస్‌గఢ్) జోడీపై అద్భుత విజయాన్ని సాధించింది. మరోవైపు మహిళల సింగిల్స్ విభాగంలో ఎనిమిదో సీడ్ వృశాలి (ఆంధ్రప్రదేశ్), సామియా ఇమాద్ ఫారూఖీ (తెలంగాణ), మూడోసీడ్ సాయి ఉత్తేజితరావు (ఆంధ్రప్రదేశ్) క్వార్టర్స్‌లో పరాజయం పాలయ్యారు.
క్వార్టర్స్ మ్యాచ్‌ల్లో వృశాలి 21–10, 15–21, 19–21తో టాప్‌సీడ్ ప్రియాన్షి పరదేశి (మధ్యప్రదేశ్) చేతిలో, సామియా 18–21, 12–21తో అష్మిత చలిహా (అస్సాం) చేతిలో, మూడోసీడ్ సాయి ఉత్తేజితరావు 12–21, 21–9, 20–22తో ఏడో సీడ్ శిఖా గౌతమ్ (ఎయిరిండియా) చేతిలో ఓటమి పాలయ్యారు. ప్రిక్వార్టర్స్‌లో క్వాలిఫయర్ కేయూర మోపాటి (తెలంగాణ) 22–20, 12–21, 14–21తో ఐరా శర్మ చేతిలో, తనిష్క్ (ఏపీ) 15–21, 15–21తో అష్మిత (అస్సాం) చేతిలో ఓడిపోయారు. అక్షిత (ఏపీ), నిషిత వర్మ (ఆంధ్రప్రదేశ్), పూర్వీ సింగ్ (తెలంగాణ) తొలి రౌండ్‌లోనే తమ ప్రత్యర్థుల చేతుల్లో పరాజయం పొందారు. పురుషుల సింగిల్స్ విభాగంలో తెలంగాణకు చెందిన రోహిత్ యాదవ్ క్వార్టర్స్‌లో 19–21, 21–15, 19–21తో రెండోసీడ్ అన్షల్ (యూపీ), జశ్వంత్ (ఏపీ) 22–24, 19–21తో మునావర్(కేరళ) చేతిలో ఓడారు.
Comments
Please login to add a commentAdd a comment