జాతీయ టోర్నీ వివరాలు వెల్లడిస్తున్న అనిల్ కామినేని తదితరులు
ఇండియన్ రౌండ్ విభాగంలో పోటీలు ∙పారా ఆర్చరీ కూడా
సాక్షి, హైదరాబాద్: జాతీయ ఆర్చరీ చాంపియన్‌షిప్‌కు నగరం వేదిక కానుంది. రేపటినుంచి రెండు రోజుల పాటు ఆర్‌ఆర్‌సీ గ్రౌండ్స్‌లో ఇండియన్ రౌండ్ విభాగంలో పోటీలు జరుగుతాయి. ఇందులో దేశవ్యాప్తంగా దాదాపు 300 మంది ఆర్చర్లు పాల్గొంటున్నారు. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి జాతీయ ఆర్చరీ టోర్నీ జరుగుతుండటం విశేషం. గురువారం జరిగిన మీడియా సమావేశంలో నిర్వాహకులు ఈ టోర్నీ వివరాలు వెల్లడించారు. బాంబూ విల్లుతో సాగే ఈ పోటీల్లో గ్రామీణ ప్రతిభను గుర్తించడమే తమ లక్ష్యమని భారత ఆర్చరీ సమాఖ్య ప్రధాన కార్యదర్శి అనిల్ కామినేని వెల్లడించారు. ప్రధానంగా గిరిజన ప్రాంతాలకు చెందిన ఆటగాళ్లను అంతర్జాతీయ స్థాయి ఆర్చర్లుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో భాగంగానే నగరంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు.
గతంలో కూడా ఇలాంటి ప్రతిభాన్వేషణ కార్యక్రమం ద్వారానే పలువురు ఆర్చర్లు వెలుగులోకి వచ్చి నట్లు అనిల్ వివరించారు. దీనికి సమాంతరంగా జాతీయ పారా ఆర్చరీ చాంపియన్‌షిప్ కూడా నిర్వహిస్తారు. ఇందులో రికర్వ్, కాం పౌండ్ విభాగాల్లో ఆర్చర్లు తలపడతారు. పారా విభాగంలో 75 మందికి పైగా ఆర్చర్లు పోటీలో నిలిచారు. పారా విభాగంలో జాతీయ స్థాయిలో పోటీలు జరగడం ఇది రెండోసారి మాత్రమే. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆర్చరీ సంఘం కార్యదర్శి ఉపాధ్యక్షుడు టి.రాజు, కోశాధికారి శంకరయ్య, హైదరాబాద్ ఆర్చరీ సంఘం కార్యదర్శి అరవింద్ కూడా పాల్గొన్నారు.