ముఖ్య అతిథిగా ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: దేశం అభివృద్ధి చెందాలంటే కేవలం సమర్థమైన ఆర్మీ, బలమైన ఆర్థిక వ్యవస్థ మాత్రమే చాలదని, క్రీడాభివృద్ధి కూడా జరగాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మన యువతలో క్రీడా నైపుణ్యానికి లోటు లేదని, ప్రపంచ యవనికపై భారత్‌ను నిలబెట్టే సత్తా క్రీడాకారులకు ఉందని ఆయన ఉద్ఘాటించారు. దేశంలో క్రీడల అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న ‘ఖేలో ఇండియా స్కూల్ గేమ్స్ (కేఐఎస్‌జీ)’ బుధవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ప్రారంభోత్సవ వేడుకల్లో మోదీ ముఖ్య అతిథిగా విచ్చేసి పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ వ్యక్తిత్వ వికాసానికి క్రీడలు దోహదం చేస్తాయన్నారు. ఖేలో ఇండియా పోటీలు క్రీడల్లో భారత్ స్థాయిని ప్రపంచానికి చాటి చెప్తాయని అన్నారు.
ఈ ప్రోగ్రామ్ ద్వారా ఏటా 1000 మంది ప్రతిభ గల యువ క్రీడాకారులను గుర్తించి వారికి 8 ఏళ్ల పాటు రూ. 5 లక్షల నగదు ప్రోత్సాహకాలను ఇస్తామని వెల్లడించారు. దేశానికి పేరు ప్రఖ్యాతులు తెచ్చిన క్రీడాకారుల చిన్ననాటి కోచ్‌లను సత్కరిస్తామని చెప్పారు. అండర్–17 విభాగంలో 16 క్రీడాంశాల్లో ఫిబ్రవరి 8 వరకు ఈ పోటీలు జరగుతాయి. ఇందులో 29 రాష్ట్రాలు, 7 కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందిన 5000 పాఠశాలల విద్యార్థులు పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్‌తో పాటు పలువురు ప్రముఖ క్రీడాకారులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment