జబీర్‌కు పసిడి పతకం
జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్
సాక్షి, గుంటూరు: జాతీయ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలిరోజే ఆంధ్రప్రదేశ్ అథ్లెట్స్ సత్తా చాటారు. ఇక్కడి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో మొదలైన ఈ పోటీల్లో తొలి రోజు ఆంధ్రప్రదేశ్‌కు ఒక స్వర్ణం, రెండు రజతాలు లభించాయి. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీ జబీర్ (50.33 సెకన్లు) స్వర్ణాన్ని కైవసం చేసుకోగా, ఎం. రామచంద్రన్ (51.17 సెకన్లు) రజతం దక్కించుకున్నాడు. తమిళనాడుకు చెందిన సంతోష్ కుమార్ (51.40 సెకన్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. పురుషుల పోల్‌వాల్ట్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ కృష్ణ ప్రశాంత్ 4.80 మీటర్ల ఎత్తు ఎగిరి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాన్ని సాధించిన లక్ష్మణన్ ఈ ఈవెంట్‌లోనూ పసిడిని తన ఖాతాలో వేసుకున్నాడు. తమిళనాడుకు చెందిన లక్ష్మణన్ 5000 మీటర్ల పరుగును 14 నిమిషాల 7.76 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచాడు. మహిళల విభాగంలో తమిళనాడుకే చెందిన లోగనాథన్ సూరియా మీట్ రికార్డును నెలకొల్పింది. ఆమె రేసును 15 నిమిషాల 46.92 సెకన్లలో పూర్తిచేసి, మూడేళ్లుగా జైషా (15 ని.57.05సె.)పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది.
మరోవైపు మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో అను రాఘవన్ (కేరళ) లక్ష్యాన్ని 57.21 సెకన్లలో పూర్తిచేసి అశ్విని అక్కుంజి (57.43సెకన్లు) పేరిట ఉన్న మీట్ రికార్డును తిరగరాసింది. జూన్‌లో జరిగిన ఫెడరేషన్ కప్‌లో హ్యామర్ త్రోలో జాతీయ రికార్డును నెలకొల్పిన సరితా సింగ్ ఈ టోర్నీలో మీట్ రికార్డును సాధించి జోరును ప్రదర్శించింది. ఆమె హ్యామర్‌ను 63.22 మీటర్ల దూరం విసిరి మంజు బాలా నెలకొల్పిన రికార్డును కనుమరుగు చేసింది.