national athletics
-
రష్మీ, భవానిలకు కాంస్యాలు
భువనేశ్వర్: ఆంధ్రప్రదేశ్ అమ్మాయిలు రష్మీ, భవాని యాదవ్ జాతీయ అథ్లెటిక్స్ పోటీల్లో పతకాలతో మెరిశారు. ఒడిశాలో జరుగుతున్న ఈ పోటీల్లో ఇద్దరు కాంస్య పతకాలు సాధించారు. జాతీయ అంతర్ రాష్ట్ర అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో మహిళల జావెలిన్ త్రో ఈవెంట్లో రష్మీ ఈటెను 50.95 మీటర్ల దూరం విసిరి మూడో స్థానంలో నిలిచింది. నాలుగో ప్రయత్నంలో ఈ మెరుగైన ప్రదర్శన ద్వారా ఆమె కాంస్య పతకం నెగ్గింది. ఇందులో అన్ను రాణి (ఉత్తరప్రదేశ్; 58.22 మీ.) స్వర్ణం, ప్రియాంక (హరియాణా; 51.94 మీ.) రజతం గెలుపొందారు. అంతకుముందు జరిగిన లాంగ్‌జంప్ పోటీలో భవాని 6.44 మీటర్ల దూరం దూకి కాంస్యంతో తృప్తిపడింది. అన్సీ సోజన్ (కేరళ; 6.51 మీ.), శైలీసింగ్ (ఉత్తరప్రదేశ్; 6.49 మీ.) వరుసగా పసిడి, రజత పతకాలు సాధించారు. భారత స్టార్ అథ్లెట్, షాట్‌పుటర్ తజీందర్ పాల్ తూర్ తన రికార్డును తానే సవరించి కొత్త ‘ఆసియా’ రికార్డు నెలకొల్పాడు. అతను గుండును 21.77 మీటర్ల దూరం విసిరాడు. దీంతో 28 ఏళ్ల పంజాబ్ అథ్లెట్ తజీందర్ 2021లో 21.49 మీటర్లతో నెలకొల్పిన రికార్డును అధిగమించాడు. అతను విసిరిన దూరం ఈ సీజన్లో ప్రపంచంలోనే తొమ్మిదో మెరుగైన ప్రదర్శనగా నిలిచింది. 21.40 మీటర్ల క్వాలిఫయింగ్ మార్క్‌ను దాటడంతో ప్రపంచ చాంపియన్‌షిప్, ఆసియా క్రీడలకూ తజీందర్ పాల్ అర్హత సంపాదించాడు. సోమవారం ముగిసిన ఈ పోటీల్లో ఏపీ అమ్మాయి యెర్రా జ్యోతి ఉత్తమ మహిళా అథ్లెట్‌గా ఎంపికైంది. తమిళనాడు ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. -
జ్యోతికశ్రీకి స్వర్ణం, రజితకు రజతం
National Athletics Grand Prix 2023: బెంగళూరులో జరుగుతున్న జాతీయ అథ్లెటిక్స్ ఇండియన్ గ్రాండ్ ప్రి ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్లు మెరిశారు. మహిళల 400 మీటర్ల పరుగులతో దండి జ్యోతికశ్రీ స్వర్ణ పతకం సాధించగా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కుంజా రజితకు రజతం దక్కింది. జ్యోతిక 54.15 సెకన్లతో అగ్రస్థానంలో, రజిత 55.57 సెకన్లతో రెండో స్థానంలో నిలిచారు. మరో.. ఆంధ్రప్రదేశ్ అమ్మాయి రొంగలి స్వాతి త్రుటిలో కాంస్యం చేజార్చుకుంది. 56.84 సెకన్ల టైమింగ్ నమోదు చేసిన స్వాతి నాలుగో స్థానంలో నిలిచింది. ఈ ఈవెంట్లో ట్వింకిల్ పున్దిర్ (మధ్యప్రదేశ్ – 56.75 సెకన్లు) మూడో స్థానం సాధించింది. చదవండి: గంగూలీవైపు కోపంగా.. కనీసం షేక్‌హ్యాండ్ ఇవ్వలేదు! -
37 ఏళ్ల జాతీయ రికార్డు బద్దలు
భువనేశ్వర్: మూడున్నర దశాబ్దాలకుపైగా చెక్కు చెదరకుండా ఉన్న జాతీయ అథ్లెటిక్స్ రికార్డు శుక్రవారం బద్దలైంది. జాతీయ ఓపెన్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా పురుషుల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లో సర్వీసెస్ తరఫున బరిలో దిగిన అవినాశ్ ఈ రికార్డును తిరగరాశాడు. 1981 టోక్యో అథ్లెటిక్స్ మీట్లో గోపాల్ సైనీ (8ని.30.88 సెకన్లు) నెలకొల్పిన రికార్డును తాజాగా ఈ 24 ఏళ్ల అథ్లెట్ సవరించాడు. అవినాశ్ 8 నిమిషాల 29.80 సెకన్లలో గమ్యాన్ని చేరి స్వర్ణం చేజిక్కించుకున్నాడు. రాకేశ్ కుమార్ స్వామి 8ని. 47.31 సెకన్లలో... దుర్గా బహదూర్ 8ని. 48.29 వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు. -
ఆర్చరీ కోచ్ మినహా...
న్యూఢిల్లీ: ‘ద్రోణాచార్య’ అవార్డుకు నామినేట్ అయిన భారత కాంపౌండ్ విభాగం ఆర్చరీ జట్టు కోచ్ జీవన్‌జ్యోత్ సింగ్ తేజ మినహా... నామినేట్ చేసిన మిగతా అందరికీ ఖేల్‌రత్న, అర్జున, ద్రోణా చార్య, ధ్యాన్‌చంద్ అవార్డులు అధికారికంగా ఖాయ మయ్యాయి. ఈ మేరకు అవార్డుల సెలెక్షన్ కమిటీ పంపించిన జాబితాకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. కొరియాలో 2015లో జరిగిన ప్రపంచ యూనివర్సిటీ క్రీడల సందర్భంగా జీవన్‌జ్యోత్ నిర్లక్ష్యం కారణంగా భారత యూనివర్సిటీ పురుషుల జట్టు ఇటలీ జట్టుతో జరగాల్సిన కాంస్య పతక పోరుకు నిర్ణీత సమయానికి వేదిక వద్దకు చేరుకోలేకపోయింది. దాంతో నిర్వాహకులు ఇటలీకి కాంస్య పతకం ఖాయం చేశారు. ఈ ఉదంతంపై విచారణ చేసిన ఆలిండియా యూనివర్సిటీల సంఘం జీవన్‌జ్యోత్‌పై మూడేళ్లపాటు, భారత ఆర్చరీ సంఘం ఏడాది పాటు నిషేధం విధించింది. కోర్టుకు వెళ్తా: జీవన్‌జ్యోత్ తన పేరును ద్రోణాచార్య అవార్డుల జాబితా నుంచి తొలగించడంపై జీవన్‌జ్యోత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘చివరి నిమిషంలో నా పేరు తొలగించడం అన్యాయం. ఈ విషయాన్ని ప్రధాని, రాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్తా. న్యాయం కోసం కోర్టులో క్రీడా శాఖపై కేసు వేస్తా’ అని జీవన్‌జ్యోత్ తెలిపాడు. ‘2015 ప్రపంచ యూనివర్సిటీ ఉదంతం విషయంలో నా తప్పిదం లేకపోయినా శిక్ష అనుభవించాను. క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించానని అనుకుంటే జకార్తా ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత జట్టు కోచ్‌గా నన్ను ఎందుకు పంపించారు. నన్ను ద్రోణాచార్య అవార్డుకు ఎంపిక చేయకూడదని క్రీడా శాఖ తీసుకున్న నిర్ణయంతో తీవ్రంగా కలత చెందాను’ అని జీవన్‌జ్యోత్ తెలిపాడు. 2018 జాతీయ క్రీడా పురస్కారాల విషయానికొస్తే భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లికి, వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానులకు ‘ఖేల్‌రత్న దక్కనుంది. ‘అర్జున’ అవార్డుల కోసం ఎంపిక చేసిన 20 మంది క్రీడాకారుల జాబితాలో తెలంగాణ నుంచి డబుల్స్ బ్యాడ్మింటన్ ప్లేయర్ సిక్కి రెడ్డి కూడా ఉంది. ఈనెల 25న రాష్ట్రపతి భవన్లో అవార్డుల ప్రదానోత్సవం జరుగుతుంది. -
ద్యుతీ చంద్‌కు స్వర్ణం
పాటియాలా: ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో ఒడిశా అథ్లెట్ ద్యుతీ చంద్ మహిళల 100 మీటర్ల పరుగులో స్వర్ణం గెలిచింది. ఆమె 11.60 సెకన్లలో గమ్యానికి చేరింది. ద్యుతీకి తెలంగాణకు చెందిన నాగపురి రమేశ్ కోచ్‌గా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ అథ్లెట్ నిత్య (12.10 సెకన్లు) నాలుగో స్థానంలో నిలిచింది. పురుషుల 100 మీటర్లలో శివ కుమార్ (తమిళనాడు–10.43 సెకన్లు) పసిడి పతకం నెగ్గాడు. ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ వంశీ ప్రవీణ్ (10.71 సెకన్లు) ఏడో స్థానంతో సంతృప్తి పడ్డాడు. -
జబీర్‌కు పసిడి పతకం
జాతీయ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్ సాక్షి, గుంటూరు: జాతీయ ఇంటర్ స్టేట్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో తొలిరోజే ఆంధ్రప్రదేశ్ అథ్లెట్స్ సత్తా చాటారు. ఇక్కడి ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో మొదలైన ఈ పోటీల్లో తొలి రోజు ఆంధ్రప్రదేశ్‌కు ఒక స్వర్ణం, రెండు రజతాలు లభించాయి. పురుషుల 400 మీటర్ల హర్డిల్స్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎంపీ జబీర్ (50.33 సెకన్లు) స్వర్ణాన్ని కైవసం చేసుకోగా, ఎం. రామచంద్రన్ (51.17 సెకన్లు) రజతం దక్కించుకున్నాడు. తమిళనాడుకు చెందిన సంతోష్ కుమార్ (51.40 సెకన్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. పురుషుల పోల్‌వాల్ట్‌లో ఆంధ్రప్రదేశ్ అథ్లెట్ కృష్ణ ప్రశాంత్ 4.80 మీటర్ల ఎత్తు ఎగిరి రజత పతకాన్ని కైవసం చేసుకున్నాడు. ఇటీవల భువనేశ్వర్‌లో జరిగిన ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాన్ని సాధించిన లక్ష్మణన్ ఈ ఈవెంట్లోనూ పసిడిని తన ఖాతాలో వేసుకున్నాడు. తమిళనాడుకు చెందిన లక్ష్మణన్ 5000 మీటర్ల పరుగును 14 నిమిషాల 7.76 సెకన్లలో పూర్తిచేసి విజేతగా నిలిచాడు. మహిళల విభాగంలో తమిళనాడుకే చెందిన లోగనాథన్ సూరియా మీట్ రికార్డును నెలకొల్పింది. ఆమె రేసును 15 నిమిషాల 46.92 సెకన్లలో పూర్తిచేసి, మూడేళ్లుగా జైషా (15 ని.57.05సె.)పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. మరోవైపు మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో అను రాఘవన్ (కేరళ) లక్ష్యాన్ని 57.21 సెకన్లలో పూర్తిచేసి అశ్విని అక్కుంజి (57.43సెకన్లు) పేరిట ఉన్న మీట్ రికార్డును తిరగరాసింది. జూన్‌లో జరిగిన ఫెడరేషన్ కప్‌లో హ్యామర్ త్రోలో జాతీయ రికార్డును నెలకొల్పిన సరితా సింగ్ ఈ టోర్నీలో మీట్ రికార్డును సాధించి జోరును ప్రదర్శించింది. ఆమె హ్యామర్‌ను 63.22 మీటర్ల దూరం విసిరి మంజు బాలా నెలకొల్పిన రికార్డును కనుమరుగు చేసింది. -
'జాతీయ అథ్లెటిక్స్‌లో రాణించాలి'
మహబూబ్‌నగర్ క్రీడలు: జాతీయస్థాయి అథ్లెటిక్స్ మీట్లో జిల్లా క్రీడాకారులు మెరుగైన ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి రాజేంద్రప్రసాద్ అన్నారు. విశాఖపట్నంలో ఈనెల 5 నుంచి 7 వరకు జరిగే జాతీయ అండర్-14, అండర్-16 బాల, బాలికల అథ్లెటిక్స్ మీట్లో పాల్గొనే క్రీడాకారులు గురువారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ క్రీడాకారులను అభినందించారు. అథ్లెటిక్స్‌లో రాష్ట్రంలోనే జిల్లాకు మంచి పేరుందని, అదే స్ఫూర్తితో పోటీల్లో అధికంగా పతకాలు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీ గజానంద్, అలీమ్, కోచ్‌లు సునీల్‌కుమార్, ఆనంద్‌కుమార్, శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు. క్రీడాకారుల వివరాలు.. లిఖిత-100మీ, క్రిష్ణవేణి-400మీ (కల్వకుర్తి) సరిత-షాట్‌ఫుట్ (బల్మూర్) మహేశ్వరి-జావెలిన్‌త్రో (ఎల్కిచర్ల) రోషన్-100మీ (చిట్యాల) శివనాయక్-షాట్‌ఫుట్ (మార్చాల) శేఖర్-100మీ (వంగూర్) రాజేందర్-200మీ (తూడుకుర్తి) నరేశ్-1000మీ (ఖిల్లాఘణపురం) అరుణ్-హైజంప్ (నేరెళ్లపల్లి) లక్ష్మణ్-లాంగ్‌జంప్ (మాడ్గుల) శ్రీను-షాట్‌ఫుట్ (బాలానగర్).