జాతీయ షూటర్ దారుణ హత్య
చండీగఢ్: జాతీయ స్థాయి షూటర్ సిప్పీ సిద్ధు దారుణ హత్యకు గురయ్యారు. గుర్తు తెలియని దుండగులు ఆయన్ను కాల్చిచంపారు. ఆదివారం రాత్రి చండీగఢ్లోని ఓ పార్క్లో సిద్ధు (34) మృతదేహాన్ని కనుగొన్నారు. అతని మృతదేహంలోకి బుల్లెట్లు దూసుకెళ్లినట్టు గుర్తించారు. సిద్ధు మరణవార్త విని భారత షూటింగ్ రంగం దిగ్భ్రాంతికి గురైంది.
పార్క్లో మృతదేహం ఉన్నట్టు స్థానికులు ఫోన్ చేసి చెప్పారని పోలీసులు తెలిపారు. సంఘటన స్థలానికి వెళ్లి విచారించగా ఆ మృతదేహం సిద్ధుదిగా గుర్తించినట్టు తెలిపారు. ఉన్నత కుటుంబానికి చెందిన సిద్ధు న్యాయవాది, స్పోర్ట్స్ ప్రమోటర్. ఈ హత్యకు గల కారణాలు తెలియాల్సివుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. 2001 నేషనల్ గేమ్స్లో షూటింగ్ టీమ్ ఈవెంట్లో సిద్ధు.. అభినవ్ బింద్రాతో కలసి స్వర్ణం సాధించారు. 15 ఏళ్లుగా షూటర్గా కొనసాగుతున్న సిద్ధు పలు షూటింగ్ పోటీల్లో పతకాలు గెలిచారు. సిద్ధు మృతికి పలువురు షూటర్లు సంతాపం ప్రకటించారు.