
దుమ్మురేపిన గప్టిల్, విలియమ్సన్
టి20ల్లో ప్రపంచ రికార్డు భాగస్వామ్యం నమోదు
రెండో మ్యాచ్‌లో పాక్‌పై కివీస్ గెలుపు
హామిల్టన్: మార్టిన్ గప్టిల్ (58 బంతుల్లో 87 నాటౌట్; 9 ఫోర్లు, 4 సిక్సర్లు), విలియమ్సన్ (48 బంతుల్లో 72 నాటౌట్; 11 ఫోర్లు) ప్రపంచ రికార్డు భాగస్వామ్యం నమోదు చేశారు. దాంతో పాకిస్తాన్ తో ఆదివారం జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో న్యూ జిలాండ్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధిం చింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మూడో టి20 గురువారం జరుగుతుంది.
సెడాన్ పార్క్ వేదికగా జరిగిన రెండో టి20 మ్యాచ్‌లో టాస్ గెలిచిన పాక్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 168 పరుగులు చేసింది. ఉమర్ అక్మల్ (27 బంతుల్లో 56 నాటౌట్; 4 ఫోర్లు, 4 సిక్సర్లు), షోయబ్ మాలిక్ (39; 5 ఫోర్లు) రాణించారు.
అనంతరం న్యూజిలాండ్ 17.4 ఓవర్లలో వికెట్లేమీ నష్టపోకుండా 171 పరుగులు చేసి నెగ్గింది. ప్రతి బంతిని బౌండరీకి తరలించే ప్రయత్నం చేయడంతో స్కోరు బోర్డు వేగంగా పరుగెత్తింది. ఈ క్రమంలో విలియమ్సన్ 35 బంతుల్లో; గప్టిల్ 40 బంతుల్లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు.
ఆ తర్వాత కూడా గప్టిల్, విలియమ్సన్ అదే జోరును కొనసాగిస్తూ తొలి వికెట్‌కు అజేయంగా 171 పరుగుల ప్రపంచ రికార్డు భాగస్వామ్యంతో జట్టును గెలిపించారు. టి20ల్లో ఏ వికెట్‌కైనా ఇదే అత్యుత్తమ భాగస్వామ్యం. 2009లో ఇంగ్లండ్‌పై గ్రేమ్ స్మిత్, బోస్‌మన్ (దక్షిణాఫ్రికా)లు నెలకొల్పిన 170 పరుగుల భాగస్వామ్యాన్ని వీళ్లు అధిగమించారు. గప్టిల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.