
స్థాయికి తగ్గట్టు ఆడితే కనీసం ఫైనల్ చేరుకోవాల్సిన టోర్నీలో భారత స్టార్ సైనా తొలి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది. ఒక్కోసారి ప్రత్యర్థి ర్యాంక్ ఆధారంగా వారి ప్రతిభను తక్కువ అంచనా వేస్తే మొదటికే మోసం వస్తుందని ఈ టోర్నీలో నిరూపితమైంది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 212వ స్థానంలో ఉన్న చైనాకు చెందిన 19 ఏళ్ల అమ్మాయి వాంగ్ జియి ధాటికి తొమ్మిదో ర్యాంకర్ సైనా చేతులెత్తేసింది.
ఆక్లాండ్: న్యూజిలాండ్ ఓపెన్ బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో మహిళల సింగిల్స్‌లో భారత పోరాటం ముగిసింది. రెండో సీడ్ సైనా నెహ్వాల్‌తోపాటు అనురా ప్రభుదేశాయ్ తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టారు. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ సైనా 16–21, 23–21, 4–21తో ప్రపంచ 212వ ర్యాంకర్ వాంగ్ జియి (చైనా) చేతిలో... అనురా 9–21, 10–21తో 2012 లండన్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లీ జురుయ్ (చైనా) చేతిలో ఓడిపోయారు. వాంగ్ జియితో తొలిసారి ఆడిన సైనా తొలి గేమ్ ఆరంభంలోనే వరుసగా నాలుగు పాయింట్లు కోల్పోయి 0–4తో వెనుకబడింది. ఆ తర్వాత వాంగ్ అదే జోరును కొనసాగించి గేమ్‌ను దక్కించుకుంది. రెండో గేమ్‌లో ఒకదశలో సైనా 12–17తో వెనుకబడినా పుంజుకొని స్కోరును సమం చేయడంతోపాటు కీలకదశలో పాయింట్లు నెగ్గి గేమ్‌ను గెల్చుకొని మ్యాచ్‌లో నిలిచింది. అయితే నిర్ణాయక మూడో గేమ్‌లో సైనా పూర్తిగా చేతులెత్తేసింది. ఈ ఏడాది ఏడు టోర్నీల్లో పాల్గొన్న సైనా మలేసియా ఓపెన్, న్యూజిలాండ్ ఓపెన్‌లలో తొలి రౌండ్‌లో ఓడిపోగా... ఇండోనేసియా మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలిచి, మలేసియా మాస్టర్స్ టోర్నీలో సెమీస్‌కు చేరింది. ఆల్ ఇంగ్లండ్, సింగపూర్ ఓపెన్, ఆసియా చాంపియన్‌షిప్‌లలో క్వార్టర్ ఫైనల్లో నిష్క్రమించింది.
పురుషుల సింగిల్స్‌లో భారత క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. సాయిప్రణీత్, ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించగా... లక్ష్య సేన్, శుభాంకర్ డే తొలి రౌండ్‌లో నిష్క్రమించారు. తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో సాయి ప్రణీత్ 21–17, 19–21, 21–15తో సహచరుడు శుభాంకర్ డేపై కష్టపడి నెగ్గగా... ప్రణయ్ 21–15, 21–14తో లో కీన్ యె (సింగపూర్)ను అలవోకగా ఓడించాడు. క్వాలిఫయర్ లక్ష్య సేన్ 21–15, 18–21, 10–21తో వాంగ్ జు వె (చైనీస్ తైపీ) చేతిలో ఓడిపోయాడు. నేడు జరిగే ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో లిన్ డాన్ (చైనా)తో సాయిప్రణీత్; టామీ సుగియార్తో (ఇండోనేసియా)తో ప్రణయ్ తలపడతారు.
పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సుమీత్ రెడ్డి–మను అత్రి (భారత్) ద్వయం 21–7, 21–10తో ఫెంగ్ జాషువా–జాక్ జియాంగ్ (న్యూజిలాండ్) జోడీని ఓడించింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్‌లో నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్) జంట 14–21, 23–21, 14–21తో లియు జువాన్‌జువాన్–జియా యుటింగ్ (చైనా) జోడీ చేతిలో పరాజయం పాలైంది.