న్యూజిలాండ్ బోణి
డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఇంగ్లండ్‌పై గెలుపు
చిట్టగాంగ్: ఇటీవలి కాలంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్న న్యూజిలాండ్ జట్టు టి20 ప్రపంచకప్‌లోనూ బోణి చేసింది. ఇంగ్లండ్‌తో శనివారం జరిగిన గ్రూప్ ‘1’ లీగ్ మ్యాచ్‌లో కివీస్ తొమ్మిది పరుగుల తేడాతో నెగ్గింది. 173 పరుగుల లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన కివీస్... 5.2 ఓవర్లలో వికెట్ నష్టానికి 52 పరుగులతో ఉన్న దశలో వర్షం అంతరాయం కలిగించింది. ఆ తర్వాత ఆట సాధ్యం కాకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిన ఫలితాన్ని ప్రకటించారు. బ్రెండన్ మెకల్లమ్ (6 బంతుల్లో 16 నాటౌట్; 1 ఫోర్; 2 సిక్స్‌లు), విలియమ్సన్ (17 బంతుల్లో 27 నాటౌట్; 4 ఫోర్లు)దూకుడుగా ఆడారు.
అంతకుముందు ఇంగ్లండ్ 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 172 పరుగులు చేసింది. మొయిన్ అలీ (23 బంతుల్లో 36; 6 ఫోర్లు; 1 సిక్స్), మైకేల్ లంబ్ (24 బంతుల్లో 33; 4 ఫోర్లు; 1 సిక్స్)తో రాణించారు. వీరిద్దరు కలిసి రెండో వికెట్‌కు 72 పరుగులు జోడించారు. వరుస ఓవర్లలో వీరు అవుట్ కావడంతో ఇంగ్లండ్ జోరుకు బ్రేక్ పడింది. రెండు వికెట్లు తీసిన కివీస్ ఆల్‌రౌండర్ అండర్సన్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ పురస్కారం లభించింది.