ఇక్కడ క్షమాపణ ఏమీ లేదు: విలియమ్సన్
విశాఖ:భారత్తో జరిగిన కీలకమైన ఐదో వన్డేలో ఘోరంగా ఓటమి పాలై సిరీస్ను కోల్పోవడంపై న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. తమ బ్యాటింగ్ పూర్తి స్థాయిలో నిరాశపరిచిన కారణంగా దారుణమైన ఓటమిని ఎదుర్కొన్నమన్నాడు. ఇది కాస్త టర్నింగ్ ట్రాక్ అయినప్పటికీ, 16 పరుగుల వ్యవధిలో 8 వికెట్లను కోల్పోవడం గేమ్కు తమ ఆటగాళ్లు చేసిన న్యాయంగా భావించడం లేదని అభిప్రాయపడ్డాడు. ఈ ఓటమి తమకు అనేక గుణపాఠాలను నేర్పుతుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు.
'గత పిచ్ల కంటే ఈ పిచ్ కాస్త భిన్నంగా ఉంది. ఇక్కడ బంతి ఎక్కువ టర్న్ అయ్యింది. దాన్ని సమర్ధవంతంగా ఎదుర్కోవడంలో మా జట్టు పూర్తిగా వైఫల్యం చెందింది. ఇలా దారుణంగా ఓడి పోవడం చాలా బాధాకరం. ఈ తరహా ఓటమి నుంచి తిరిగి జట్టును చక్కదిద్దుకోవడానికి ఆస్కారం దొరకుతుంది. ఐదో వన్డేకు ముందు టీమిండియాను ఎదుర్కోవడానికి తగిన వ్యూహాలు రచించాం. అయితే మా బ్యాటింగ్ పూర్తిగా నిరాశ పరిచింది. మేము దారుణంగా ఆడటం వల్లే మూల్యం చెల్లించుకున్నాం. భారత్ కచ్చితంగా మంచి జట్టే. ఈ సిరీస్లో వారు నిలకడైన ప్రదర్శన చేసి సిరీస్ సాధించారు. వారు సిరీస్ సాధించడానికి అర్హులు. ఇక్కడ క్షమాపణ ఏమీ లేదు 'అని విలియమ్సన్ స్పష్టం చేశాడు.