నాటకీయత నడుమ...
ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రి విజేత రోస్‌బర్గ్
రెండో స్థానం పొందిన రికియార్డోపై అనర్హత వేటు
వెటెల్, హామిల్టన్ విఫలం
‘ఫోర్స్ ఇండియా’ డ్రైవర్లిద్దరూ బోణీ
రేసు పూర్తి చేయని ఏడుగురు డ్రైవర్లు
మెల్‌బోర్న్: ఫార్ములావన్ కొత్త సీజన్ సంచలనాలతో ప్రారంభమైంది. ఊహించని ఫలితాలు... ఆనందం వెంటే నిరాశ... స్టార్ డ్రైవర్ల వైఫల్యం... ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు డ్రైవర్లు రేసు పూర్తిచేయలేకపోవడం.. ఇలా పలు నాటకీయ పరిణామాల నడుమ సాగిన సీజన్ తొలి రేసు ఆస్ట్రేలియన్ గ్రాండ్‌ప్రిలో మెర్సిడెస్ జట్టు డ్రైవర్ నికో రోస్‌బర్గ్ విజేతగా నిలిచాడు. 57 ల్యాప్‌ల రేసును రోస్‌బర్గ్ (జర్మనీ) గంటా 32 నిమిషాల 58.710 సెకన్లలో పూర్తి చేసి కెరీర్‌లో నాలుగో విజయాన్ని నమోదు చేశాడు. మూడో స్థానం నుంచి రేసును మొదలుపెట్టిన రోస్‌బర్గ్ ఆరంభంలోనే ఆధిక్యంలోకి వెళ్లి చివరిదాకా అదే జోరును కొనసాగించాడు.
‘పోల్ పొజిషన్’తో రేసును ప్రారంభించిన ప్రపంచ మాజీ చాంపియన్ లూయిస్ హామిల్టన్ (మెర్సిడెస్) కారు ఇంజిన్‌లో ఇబ్బంది తలెత్తింది. దాంతో అతను రెండో ల్యాప్‌లోనే రేసు నుంచి వైదొలిగాడు.
వరుసగా 10వ విజయం సాధిస్తాడనుకున్న డిఫెండింగ్ ప్రపంచ చాంపియన్ సెబాస్టియన్ వెటెల్ (రెడ్‌బుల్)కు తొలి రేసు నిరాశ మిగిల్చింది. కారు ఇంజిన్‌లో సమస్య కారణంగా వెటెల్ మూడు ల్యాప్‌ల తర్వాత రేసు నుంచి తప్పుకున్నాడు.
వెటెల్ సహచరుడు, రెడ్‌బుల్‌కే చెందిన మరో డ్రైవర్ రికియార్డోకు సొంతగడ్డపై చేదు అనుభవం ఎదురైంది. గంటా 33 నిమిషాల 23.235 సెకన్లలో రేసును పూర్తిచేసిన రికియార్డో రెండో స్థానాన్ని దక్కించుకున్నాడు. బహుమతి ప్రదానోత్సవంలో షాంపేన్ విరజిమ్మడంతోపాటు రన్నరప్ ట్రోఫీనీ అందుకున్నాడు. అయితే రేసు సందర్భంగా రికియార్డో నిబంధనలకు విరుద్ధంగా పరిమితికంటే ఎక్కువ ఇంధనం వాడినట్లు తేలింది. ఐదు గంటల విచారణ అనంతరం ఈ ఆస్ట్రేలియన్ డ్రైవర్‌పై నిర్వాహకులు అనర్హత వేటు వేశారు. అతని ఫలితాన్ని రద్దు చేశారు. దాంతో మూడో స్థానంలో నిలిచిన కెవిన్ మాగ్నుసన్ (డెన్మార్క్)కు రెండో స్థానం లభించింది.
రేసు మొదలైన వెంటనే కొబయాషి (కాటర్‌హమ్) నియంత్రణ కోల్పోయి పక్కనే ఉన్న ఫెలిప్ మసా (ఫెరారీ) కారును ఢీకొట్టాడు. దాంతో ఈ ఇద్దరూ తొలి ల్యాప్‌లోనే నిష్ర్కమించారు. సాంకేతిక సమస్యలతో గ్రోస్యెన్ (లోటస్) 43వ ల్యాప్‌లో... మల్డొనాడో (లోటస్) 29వ ల్యాప్‌లో... మార్కస్ ఎరిక్సన్ (కాటర్‌హమ్) 27వ ల్యాప్‌లో రేసు నుంచి వైదొలిగారు.
భారత్‌కు చెందిన ‘ఫోర్స్ ఇండియా’కు తొలి రేసు కలిసొచ్చింది. ఇద్దరు డ్రైవర్లూ పాయింట్ల ఖాతా తెరిచారు. హుల్కెన్‌బర్గ్ ఆరో స్థానంలో నిలిచి ఎనిమిది పాయింట్లు... సెర్గియో పెరెజ్ 10వ స్థానంలో నిలిచి ఒక పాయింట్ సంపాదించారు.
ఎఫ్1 చరిత్రలో పిన్న వయస్సులో (19 ఏళ్ల 10 నెలల 18 రోజులు) పాయింట్లు నెగ్గిన డ్రైవర్‌గా డానిల్ క్వియాట్ (రష్యా) రికార్డు నెలకొల్పాడు. ఎస్టీఆర్ జట్టు తరఫున అరంగేట్రం చేసిన క్వియాట్ తొమ్మిదో స్థానంలో నిలిచి రెండు పాయింట్లు సాధించాడు.