
నిజ్నీ నొవోగొరోడ్: రక్షణ శ్రేణిలో లోపాలు... మిడ్ ఫీల్డర్ల నుంచి స్టార్ ప్లేయర్ మెస్సీకి సహకారం కొరవడటం... వెరసి ఫుట్‌బాల్ ప్రపంచకప్‌లో అర్జెంటీనా కష్టాలు కొనసాగుతున్నాయి. ఐస్‌లాండ్‌తో తొలి మ్యాచ్‌లో ‘డ్రా’తో గట్టెక్కిన ఈ మాజీ విశ్వవిజేత క్రొయేషియాతో రెండో మ్యాచ్‌లో మాత్రం ఖాతా కూడా తెరవలేకపోయింది. అర్జెంటీనా బలహీనతలను పూర్తిగా సద్వినియోగం చేసుకున్న క్రొయేషియా 3–0తో నెగ్గి గ్రూప్ ‘డి’ నుంచి తొలి ప్రిక్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. క్రొయేషియా తరఫున రెబిక్ (53వ ని.లో), మోడ్రిక్ (80వ ని.లో), రాకిటిక్ (90+1వ ని.లో) ఒక్కో గోల్ చేశారు. ప్రపంచకప్‌లో క్రొయేషియా చేతిలో 1998లో ఏకైకసారి ఆడి ఓడిపోయిన అర్జెంటీనాకు ఈసారి ఏదీ కలిసిరాలేదు.
అవకాశం దొరికినపుడల్లా దాడులు చేసిన అర్జెంటీనా ఆటగాళ్లు బంతిని లక్ష్యానికి మాత్రం చేర్చలేకపోయారు. విరామ సమయానికి రెండు జట్లు ఖాతా తెరవలేదు. రెండో అర్ధభాగంలో క్రొయేషియా దూకుడుగా ఆడి ఫలితాన్ని సాధించింది. 53వ నిమిషంలో అర్జెంటీనా ప్లేయర్ మెర్సాడో ‘డి’ ఏరియాలో తమ గోల్‌కీపర్‌కు బంతిని పాస్ ఇవ్వగా... అతను దానిని చేతితో పట్టుకోకుండా కాలితో తన్నాడు. బంతి కాస్తా అక్కడే గాల్లోకి తేలడం.. అక్కడే ఉన్న క్రొయేషియా ఆటగాడు రెబిక్ దానిని గోల్‌పోస్ట్‌లోకి పంపడం జరిగిపోయాయి. ఇక 80వ నిమిషంలో మోడ్రిక్ 20 గజాల దూరం నుంచి డైరెక్ట్ కిక్‌తో అర్జెంటీనా గోల్‌కీపర్‌ను బోల్తా కొట్టించాడు. ఇంజ్యూరీ సమయంలో కొవాచిచ్‌తో సమన్వయంతో రాకిటిక్ గోల్ చేశాడు.
Comments
Please login to add a commentAdd a comment