ప్రపంచ కప్‌లో అర్జెంటీనాను ఇలాంటి స్థితిలో చూడటం చాలా ఇబ్బందికర పరిస్థితి. ఆడాల్సిన ఒక్క మ్యాచ్‌లో విజయం తప్పనిసరి మాత్రమే కాక... క్రొయేషియా–ఐస్‌లాండ్ మ్యాచ్ ఫలితం పైనా ఆధారపడాల్సి వస్తోంది. ఏదేమైనా ఓ అభిమానిగా మా జట్టు ఓటమిని నేను వ్యతిరేకిస్తా. ఈ సందర్భం నాకు 1982, 1990 ప్రపంచ కప్‌లను గుర్తుకుతెస్తోంది. అప్పట్లో డిఫెండింగ్ చాంపియన్లుగా బరిలో దిగిన మేం ఓటములతో ప్రయాణం ప్రారంభించాం. మొదటిసారి మిగతా రెండు మ్యాచ్‌లను గెలిచి నాకౌట్ చేరాం. రెండోసారి నేను కెప్టెన్‌గా ఉన్న జట్టు ఫైనల్‌కు వెళ్లింది. తదుపరి ఫలితం వేర్వేరుగా ఉన్నా... పోరాటపటిమతో గ్రూప్ అడ్డంకి దాటిన ఈ రెండు ఉదంతాలు నాకు ఎప్పటికీ గుర్తుంటాయి. ఈసారి సైతం అలానే జరుగుతుందని నమ్ముతున్నా. నైజీరియాపై భారీ వ్యత్యాసంతో గెలవడం అర్జెంటీనాకు అవసరం. దీనికి పూర్తిస్థాయి సంసిద్ధత కావాలి. తమ సత్తా ఏంటో ప్రపంచానికి చాటేందుకు ఆటగాళ్లకు ఇది చివరి అవకాశం.
వారు సాధిస్తారని నాకు విశ్వాసం ఉంది. బలాబలాలకు తగ్గ ప్రణాళికలు వేయడంతో పాటు ప్రతి ఆటగాడికి కోచ్ సంపోలి బాధ్యతలు అప్పగించాలి. ఈ ప్రక్రియ పక్కాగా సాగాలి. తనొక్కడికే సాధ్యమైన దానిని మెస్సీ చేసి చూపాలి. ఇదే సమయంలో వన్ మ్యాన్ షోలా కాకుండా జట్టంతా సమష్టిగా ఆడాలి. నైజీరియా ప్రమాదకర ప్రత్యర్థి. గత ప్రపంచకప్ సహా వారితో చాలా సార్లు తలపడి ప్రతిసారీ గెలిచాం. మాకిది నైతికంగా బలాన్నిస్తుంది. మా కుర్రాళ్లు తమ ఆంకాక్ష ఎంత బలంగా ఉందో చాటుతూ... ఈ మ్యాచే తమ జీవితం అన్నట్లుగా ఆడాలి. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పుకోవాలి. ప్రపంచం ఇప్పుడు మెస్సీ వైపు చూస్తోంది. ఆ స్థాయి ఆటగాడికిది సాధారణమే. అయినా... నేను మళ్లీ చెబుతున్నా. ఇది ఒక్కడి ఆట కాదు. ఓటమి, గెలుపు అందరివి. బాధ్యతలను అందరూ పంచుకోవాలి.
అర్జెంటీనా... అదరగొట్టాలి!
Published Tue, Jun 26 2018 1:09 AM | Last Updated on Tue, Jun 26 2018 1:09 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment