ఇప్పటివరకు తొమ్మిదిసార్లు ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్ జరిగింది. 2006లో స్వదేశంలో జరిగిన ఈవెంట్‌లో భారత్ అత్యధికంగా ఎనిమిది పతకాలు సాధించి తమ అత్యుత్తమ ప్రదర్శన నమోదు చేసింది. అనంతరం జరిగిన ఐదు ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో భారత్ ఈ తరహా ప్రదర్శన పునరావృతం చేయలేకపోయింది. పుష్కర కాలం తర్వాత మళ్లీ సొంతగడ్డపై భారత బాక్సర్లకు తమ ఉత్తమ ప్రదర్శనను సమం చేసే అవకాశం లభించింది. ఇలా జరగాలంటే నేడు జరిగే ఎనిమిది క్వార్టర్ ఫైనల్స్‌లోనూ భారత బాక్సర్లు తమ పంచ్ పవర్‌తో ప్రత్యర్థుల పని పట్టాల్సి ఉంటుంది. బరిలో దిగిన అందరూ గెలిస్తే భారత్ ఖాతాలోఎనిమిది పతకాలు ఖాయమవుతాయి.
న్యూఢిల్లీ: ప్రత్యర్థి ఎవరైనా... నేపథ్యం ఎంత ఘనంగా ఉన్నా... అవేవీ లెక్క చేయకుండా భారత మహిళా బాక్సర్లు దూసుకుపోతున్నారు. పంచ్‌ల వర్షం కురిపిస్తూ ప్రత్యర్థుల ఆట కట్టిస్తూ ముందంజ వేస్తున్నారు.ఆదివారం నలుగురు బాక్సర్లు క్వార్టర్ ఫైనల్ బెర్త్‌లు ఖరారు చేసుకోగా... సోమవారం మరో నలుగురు క్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. ఇక్కడి కేడీ జాదవ్ స్టేడియంలో జరుగుతున్న ప్రపంచ సీనియర్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో ఐదో రోజు సోనియా చహల్ (57 కేజీలు), పింకీ రాణి (51 కేజీలు), సిమ్రన్‌జిత్ కౌర్ (64 కేజీలు) తమ ప్రత్యర్థులపై విజయం సాధించగా... ప్లస్ 81 కేజీల విభాగంలో సీమా పూనియాకు నేరుగా క్వార్టర్ ఫైనల్‌కు ‘బై’ లభించింది. అయితే 75 కేజీల విభాగంలో మాత్రం భారత బాక్సర్ సవీటి బూరా పరాజయం పాలై ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించింది. ఈ మెగా ఈవెంట్‌లో మొత్తం 10 వెయిట్ కేటగిరీలలో పోటీలు జరుగుతుండగా... భారత్ నుంచి సరితా దేవి (60 కేజీలు), సవీటి బూరా (75 కేజీలు) మినహా మిగతా ఎనిమిది మంది క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్నారు.
విజయం... వివాదం
హరియాణాకు చెందిన 21 ఏళ్ల సోనియా చహల్ పాల్గొన్న 57 కేజీల ప్రిక్వార్టర్ ఫైనల్ బౌట్ ఫలితం వివాదాస్పదమైంది. ఈ బౌట్‌లో సోనియా 3–2తో 2014 ప్రపంచ చాంపియన్‌షిప్ స్వర్ణ పతక విజేత స్టానిమిరా పెట్రోవా (బల్గేరియా)ను ఓడించింది. రెండో రౌండ్ వరకు వెనుకబడి ఉన్న సోనియా చివరి రౌండ్‌లో పుంజుకొని గెలిచింది. అయితే తుది ఫలితంపై సోనియా ప్రత్యర్థి స్టానిమిరా అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆతిథ్య దేశం బాక్సర్లకు బౌట్ జడ్జిలు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, వారు అవినీతికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది.
సోనియాను రిఫరీ విజేతగా ప్రకటించే సందర్భంలో నిర్వేదంగా నవ్వుతూ, చూపుడు వేలును ఊపుతూ ఆమె నిరసన ప్రకటించింది. స్టానిమిరా కోచ్ పీటర్ యొసిఫవ్ లెసోవ్ ఏకంగా రింగ్‌లోకి నీళ్ల సీసాను విసిరేశాడు. దీంతో అంతర్జాతీయ బాక్సింగ్ సంఘం (ఏఐబీఏ) అతడి అక్రిడిటేషన్‌ను రద్దు చేసి పోటీల ప్రాంతం నుంచి బహిష్కరించింది. ఇతర బౌట్‌లలో పింకీ 5–0తో ఇంగ్లండ్‌కు చెందిన ఎలిస్ ఎబొని జోన్స్‌పై,సిమ్రన్‌జిత్ 5–0తో మెగన్ రీడ్ (స్కాట్లాండ్)పై ఏకపక్ష విజయాలు సాధించారు. 75 కేజీల విభాగంలో భారత్‌కు నిరాశే మిగిలింది. ఇందులో సవీటి బూరా 0–5తో ఎల్జిబీటా వొజిక్ (పోలండ్) చేతిలో ఓడిపోయింది.
క్వార్టర్స్‌లో ఎవరితో ఎవరు
►54 కేజీలు మనీషా గీ స్టొయికా (బల్గేరియా)
►69 కేజీలు లవ్లీనా గీ స్కాట్ కయి (ఆస్ట్రేలియా)
►81 కేజీలు భాగ్యవతి గీ జెస్సికా (కొలంబియా)
►48 కేజీలు మేరీకోమ్ గీ వు యు (చైనా)
►57 కేజీలు సోనియా గీ కాస్టెనాడ (కొలంబియా)
►ప్లస్ 81 కేజీలుసీమా గీ జియోలి యాంగ్ (చైనా)
►51 కేజీలు పింకీ రాణి గీ చోల్ మి పాంగ్ (కొరియా)
►64 కేజీలు సిమ్రన్‌జిత్ గీ అమీ సారా (ఐర్లాండ్)
మధ్యాహ్నం గం.1.00 నుంచి స్టార్ స్పోర్ట్స్ సెలెక్ట్–1లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment