అందుకే 'ముందుకు' వచ్చా: ధోని
మొహాలి: బ్యాటింగ్ లో తన సత్తా చాటేందుకు నాలుగో స్థానమే సరైందని టీమిండియా వన్డే కెప్టెన్ ఎంఎస్ ధోని అభిప్రాయపడ్డాడు. లోయర్ ఆర్డర్ లో బ్యాటింగ్ చేయడం వల్ల తానేంటో నిరూపించుకోవడానికి కష్టపడాల్సి వస్తోందని అన్నాడు. ఆదివారం న్యూజిలాండ్ తో జరిగిన మూడో వన్డేలో ధోని నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు దిగి అర్థసెంచరీ(80)తో రాణించాడు. ధోనికి తోడు కోహ్లి సెంచరీతో చెలరేగడంతో టీమిండియా 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.
మ్యాచ్ ముగిసిన తర్వాత ధోని మీడియాతో మాట్లాడాడు. తన సత్తా చాటేందుకే బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు వచ్చినట్టు తెలిపాడు. 'నేనేంటో చెప్పడానికే నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చాను. సత్తా చాటాను. నాలుగు స్థానంలో బ్యాటింగ్ దిగితే తప్పనిసరిగా పెద్ద షాట్లు ఆడాలి. నేనేంటో నిరూపించుకోవడానికి ఈ స్థానమే కరెక్ట్. లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ కు దిగడం వల్ల ఎక్కువసేపు ఆడడటానికి అవకాశం ఉండట్లేదు. అందుకే బ్యాటింగ్ ఆర్డర్ లో ముందుకు వచ్చాను. ఎక్కువసేపు క్రీజ్ లో ఉంటే బాగా ఆడతాననే నమ్మకం ఉంద'ని ధోని అన్నాడు. ఈ మ్యాచ్ లో ధోని 9 వేల పరుగుల మైలురాయిని దాటాడు.
సెంచరీ వీరుడు విరాట్ కోహ్లి గురించి మాట్లాడుతూ... 'క్రికెట్ ఇప్పుడు చాలా మారిపోయింది, దీన్ని పోల్చడం కష్టం. బ్యాట్సమన్లను ఒకరితో ఒకరిని పోల్చడం అసంబద్దంగా ఉంటుంది. గొప్ప ఆటగాళ్లలో విరాట్ కోహ్లి ఒకడు. అతడు ఆడుతున్నప్పుడు చూడడం నాకెంతో ఇష్టమ'ని మిస్టర్ కూల్ పేర్కొన్నాడు.