
భోగ్లేకు భాగ్యం లేదు
ఐపీఎల్ కామెంటేటర్ల జాబితాలో దక్కని చోటు
న్యూఢిల్లీ: ప్రముఖ టీవీ వ్యాఖ్యాత హర్షా భోగ్లేకు ఈ ఐపీఎల్‌లోనూ కామెంటరీ చేసే భాగ్యం లేకపోయింది. ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ సంస్థ విడుదల చేసిన ఎలైట్ ప్యానెల్ కామెంటేటర్ల జాబితాలో ఆయనకు చోటు దక్కలేదు. ఆటకు దూరంగా ఉన్న పుణే ఆటగాడు కెవిన్ పీటర్సన్ ఈ సీజన్‌లో తెరవెనక వినిపించనున్నాడు. 20 మంది ఎలైట్ ప్యానెల్లో అతనితో పాటు మైకేల్ క్లార్క్, సునీల్ గావస్కర్ తదితరులున్నారు. వీరంతా 47 రోజులపాటు పది వేదికల్లో తమ వ్యాఖ్యానాన్ని వినిపిస్తారు. జాబితాలో స్థానం పొందిన పలువురు కామెంటేటర్లు ఐపీఎల్–10పై ఇలా స్పందించారు.
‘ఐపీఎల్ అంటే నాకెంతో ఇష్టం. ఇంతకు మించిన ఈవెంట్ నాకేది కనిపించలేదు’ అని సంజయ్ మంజ్రేకర్ అన్నారు. ‘గతంలో ప్లేయర్‌గా ఐపీఎల్ అనుభూతిని పొందాను. ఇప్పుడు కొత్తగా కామెంటేటర్‌గా మైక్ పట్టుకునేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’ అని క్లార్క్ అన్నారు. ఈయన ఇటీవల జరిగిన భారత్, ఆసీస్ టోర్నీకి వ్యాఖ్యాతగా పనిచేశారు. పీటర్సన్ మాట్లాడుతూ మళ్లీ భారత్‌లో క్రికెట్ యాక్షన్‌లో భాగమైనందుకు ఆనందంగా ఉందన్నారు.
‘వాడా’ జాబితాలో మూడో ఏడాదీ మూడో స్థానంలో...
న్యూఢిల్లీ: క్రీడల్లో ప్రతిభ చూపడమేమో కానీ ఆటగాళ్లు డోపింగ్‌కు పాల్పడిన విషయంలో భారత్ వరుసగా ‘మంచి’ స్థానమే పొందుతోంది. అత్యధికంగా డోపింగ్‌కు పాల్పడిన దేశాలతో కూడిన జాబితాను తాజాగా ప్రపంచ డోపింగ్ నిరోధక సంస్థ (వాడా) విడుదల చేసింది. 2015కు సంబంధించిన ఈ డోపింగ్ అత్రికమణ జాబితాలో భారత్ వరుసగా మూడో ఏడాదీ మూడో స్థానంలో నిలిచింది. 117 మంది భారత ఆటగాళ్లు నిషేధిత ఉత్ప్రేరకాలు తీసుకున్నట్టు తేలారు. ‘వాడా’ జాబితాలో రష్యా సమాఖ్య (176 మంది ఆటగాళ్లు) తొలి స్థానంలో నిలవగా... ఇటలీ (129) రెండో స్థానంలో ఉంది.