
న్యూఢిల్లీ: దాదాపు నాలుగేళ్ల సుదీర్ఘ విరామం తరువాత తన పునరాగమనానికి సంబంధించి భారత వెటరన్ పేస్ బౌలర్ ఆర్ వినయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం 33 ఏళ్ల వయసులో ఉన్న వినయ్ కుమార్.. తిరిగి భారత క్రికెట్ జట్టులో స్థానం సంపాదించడం ఖాయమంటున్నాడు. ఇక్కడ సత్తా ఉండాలే కానీ వయసుతో సంబంధం లేదంటూ రీ ఎంట్రీపై ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఒకే ఒక్క ఛాన్స్ వస్తే చాలు తనను నిరూపించుకుంటానంటూ స్పష్టం చేశాడు.
'నేను ఫిట్ నెస్ ను నిరూపించుకునే పనిలో ఉన్నా. అది కూడా జాతీయ జట్టులో పునరామనం చేసేందుకే. ప్రస్తుతం నా పరిస్థితి ఏమిటో అనే విషయంలో పూర్తిగా స్పష్టత ఉంది. ఒకవేళ నాకు 21-22 ఏళ్లు అయితే మాత్రం భారత జట్టులో చోటు కోల్పోవడాన్ని జీర్ణించుకుని విషయం చాలా కష్టంగా ఉండేది. నాకు ఇప్పుడు 33 ఏళ్లు. ఇక నాకొచ్చే ప్రతీ ఛాన్స్ ఒక దీవెనలాంటిదే. బౌలర్లు ఎప్పుడు ఐదు వికెట్లు సాధించిన అది వారికి ఎక్కువ సంతోషాన్ని తీసుకొస్తుంది. నేను ఆ తరహా బౌలర్ని అని కచ్చితంగా చెప్పగలను. ఎవరైనా బ్యాట్స్ మెన్ కీలక భాగస్వామ్యాన్ని నమోదు చేసినప్పుడు వారి వికెట్ తీస్తే చాలా ఆనంద పడతా. చిన్న చిన్న విషయాలకు ఎక్కువగా ఎంజాయ్ చేస్తా. మళ్లీ భారత జట్టులో పునరాగమనం చేయడంపైనే నా దృష్టి ఉంది. గడిచిన మూడేళ్లలో బీసీసీఐ నుంచి రెండు అవార్డులు తీసుకున్నా. 2014-15 రంజీ ట్రోఫీలో అత్యధిక వికెట్లు తీసిన క్రమంలో అత్యుత్తమ బౌలర్ అవార్డును బీసీసీఐ నుంచి అందుకున్నా. 2013-14 సీజన్ లో భాగంగా పరిమిత ఓవర్ల క్రికెట్ లో బెస్ట్ ఆల్ రౌండర్ అవార్డును కూడా అందుకున్నా. ప్రదర్శన పరంగా నాపై ఎటువంటి అనుమానం లేదు. భారత జట్టులోకి వస్తా. ఆ అవకాశం కోసం ఎదురుచూస్తున్నా'అని వినయ్ కుమార్ తెలిపాడు. భారత్ జట్టులో 2013లో చివరిసారి కనిపించిన వినయ్ కుమార్..ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 430కి పైగా వికెట్లు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment