ఆ చిన్నఆశ కూడా ఆవిరైంది
రియో ఒలింపిక్స్లో పోటీల చివరి రోజు ఆదివారం మూడో పతకం వస్తుందని ఆశించిన భారత అభిమానులకు నిరాశ ఎదురైంది. భారత రెజ్లర్ యోగేశ్వర్ దత్ పతకం గెలుస్తాడని అంచనా వేశారు. కాగా పురుషుల రెజ్లింగ్ 65 కిలోల ఫ్రీస్టయిల్ ఈవెంట్ క్వాలిఫయింగ్ రౌండ్లోనే వెనుదిరిగాడు. మంగోలియా రెజ్లర్ గంజోరిగీన్ మండఖ్నారన్ చేతిలో 0-3 తేడాతో ఓడిపోయాడు. అయితే మంగోలియా రెజ్లర్ ఫైనల్కు వెళితే యోగేశ్వర్కు రెపిచేజ్ అవకాశం వస్తుందని, కనీసం కాంస్య పతకం పోరులోనైనా నిలుస్తాడన్న చిన్నఆశ కూడా ఆవిరైంది. క్వార్టర్స్లో అతను ఓడిపోవడంతో యోగేశ్వర్ పతకం ఆశలు గల్లంతయ్యాయి. గత లండన్ ఒలింపిక్స్లో కాంస్యం గెలిచిన ఈ హరియాణా రెజ్లర్ రెండో పతకం సాధించాలన్న కల నెరవేరలేదు.
ఈ రోజు మారథాన్ పోటీలో భారత అథ్లెట్లు గోపి తనక్కల్, నితేంద్ర సింగ్, ఖేత రామ్ ఉన్నా పతకం గెలిచే అవకాశాలు చాలా తక్కువ. దీంతో అద్భుతం జరిగితే తప్ప భారత్ రియో ఒలింపిక్స్లో రెండు పతకాలతో సరిపెట్టుకోవాల్సిందే. భారత రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్యం, బ్యాడ్మింటన్ సంచలనం పీవీ సింధు రజత పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. లండన్ ఒలింపిక్స్లో ఆరు పతకాలు సాధించిన భారత్.. రియోలో మరిన్ని ఎక్కువ పతకాలు సొంతం చేసుకుంటుందని పోటీలకు ముందు అంచనా వేశారు. ఒలింపిక్స్ చరిత్రలో అతిపెద్ద భారత జట్టు ఈసారి పోటీలకు వెళ్లింది. అయితే పతకాలు గెలుస్తారనుకున్న స్టార్ క్రీడాకారులు నిరాశపరచడంతో అంచనాలు తలకిందులయ్యాయి.