
న్యూఢిల్లీ: మిగతా క్రీడాంశాలతో పోలిస్తే షూటింగ్ క్రీడా కార్యక్రమాలే ముందుగా ప్రారంభమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని భారత దిగ్గజ షూటర్ గగన్ నారంగ్ అభిప్రాయపడ్డాడు. ఆటగాళ్లతోనే క్రీడా పరికరాలు ఉండటంతోపాటు, ఒకరిని మరొకరు తాకే వీలు లేని ఆట కాబట్టి షూటింగ్ శిక్షణా కార్యక్రమాల్ని పునరుద్ధరించే అవకాశాలున్నాయని పేర్కొన్నాడు. ‘కోవిడ్–19 తీవ్రత తగ్గిన తర్వాత సరైన నిబంధనలు పాటిస్తూ షూటింగ్ కార్యక్రమాల్ని తిరిగి మొదలు పెడితే బావుంటుంది.
యూరప్ దేశాల్లో కొన్ని చోట్ల అవి ఇప్పటికే మొదలైనట్లు నేను విన్నాను. ఇది జరగొచ్చు. ఎందుకంటే షూటింగ్ రేంజ్‌లలో సామాజిక దూరం పాటిస్తూ శిక్షణలో పాల్గొనవచ్చు. మనిషికి మనిషికి మధ్య ఎడం ఉండే ఆటల్లో షూటింగ్ ఒకటి. 10 మీటర్ల రేంజ్‌లో ఇద్దరు షూటర్ల మధ్య 1–1.5మీ. ఎడం ఉంటుంది. 50 మీటర్ల రేంజ్‌లో 1.25 మీటర్ల దూరం ఉంటుంది కాబట్టి అన్ని క్రీడలతో పోలిస్తే షూటింగ్ కార్యకలాపాలే ముందుగా ప్రారంభమవుతాయని అనుకుంటున్నా’నని లండన్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ అన్నాడు.