
కోల్‌కతా : న్యూజిలాండ్‌తో సిరీస్ అనంతరం ఎక్కువగా చర్చించింది ఇద్దరు భారత క్రికెటర్ల గురించే కాగా, ఒకరు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, మరో ప్లేయర్ హార్ధిక్ పాండ్యా. రిటైర్ అవ్వాలంటూ ధోనికి లక్ష్మణ్, అగార్కర్ లు సూచించగా.. రవిశాస్త్రి, విరాట్ కోహ్లీ, సునీల్ గవాస్కర్ లు ధోనికి మద్ధతు తెలిపారు. మరోవైపు శ్రీలంకతో టెస్ట్ సిరీస్ లో తొలి రెండు టెస్టులకుగానూ హార్ధిక్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వడం విమర్శలకు దారితీసింది. కెరీర్ ఆరంభంలోనే విశ్రాంతి అవసరమా.. అంత ఎక్కువగా పాండ్యా అలసిపోయాడా అన్న ప్రశ్నలపై కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పందించాడు.
కోల్‌కతాలో కోహ్లీ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. 'యువ ఆల్ రౌండర్ పాండ్యాకు విశ్రాంతి ఇవ్వడం సరైన నిర్ణయం. ప్రతి క్రికెటర్ ఏడాదిలో 40 మ్యాచ్‌లు మాత్రమే ఆడగలడు. అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడితే అతడికి విశ్రాంతి అవసరమే. ఈ నేపథ్యంలోనే పాండ్యాకు కాస్త విశ్రాంతి ఇచ్చాం. ఇంకా చెప్పాలంటే.. నేను కూడా ఎక్కువ మ్యాచ్‌లు ఆడాను. నాకు కూడా ప్రస్తుతం కాస్త విరామం కావాలి. అయితే లంకతో సిరీస్‌ను మేం తేలికగా తీసుకోవడం లేదు. అందుకే ప్రతీ మ్యాచ్ మాకు ముఖ్యమని భావించి ఈ సిరీస్ నుంచి నేను తప్పుకోలేదంటూ' వివరించాడు.
రేపు (గురువారం) ఇక్కడి ఈడెన్ గార్డెన్‌లో శ్రీలంక, భారత్ జట్లు తొలి టెస్టులో తలపడనున్నాయి. ఇప్పటివరకూ భారతగడ్డ మీద టీమిండియాపై లంక ఒక్క టెస్ట్ మ్యాచ్ కూడా నెగ్గకపోవడం పర్యాటక జట్టుకు ప్రతికూలాంశం. కాగా వరుస సిరీస్ విజయాలు సాధిస్తూ టెస్టుల్లో నెం1 ర్యాంకుతో జోరు మీదున్న కోహ్లీ సేనను ఓడించడం లంక ఆటగాళ్లకు పెను సవాలేనని సీనియర్ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment