96 ఏళ్ల తర్వాత...
సెమీస్‌కు చేరిన జపాన్ క్రీడాకారుడు
వావ్రింకాపై నిషికోరి గెలుపు
జొకోవిచ్, సెరెనాల దూకుడు
మిక్స్‌డ్ ఫైనల్లో సానియా జోడి
యూఎస్ ఓపెన్
జపాన్ క్రీడాకారుడు నిషికోరి 96 ఏళ్ల చరిత్రను తిరగరాశాడు. 1918 తర్వాత తన దేశం తరఫున యూఎస్ ఓపెన్‌లో సెమీస్‌కు చేరిన తొలి క్రీడాకారుడిగా రికార్డులకెక్కాడు. వావ్రింకాతో గతంలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఓడిన నిషికోరి ఈసారి ప్రతీకారం తీర్చుకున్నాడు. ఐదు సెట్ల హోరాహోరీ పోరాటంలో పైచేయి సాధించాడు. మరోవైపు జొకోవిచ్ తన జైత్రయాత్రను కొనసాగిస్తూ టైటిల్‌కు రెండు అడుగుల దూరంలో నిలిచాడు.
న్యూయార్క్: పట్టు వదలకుండా పోరాడిన జపాన్ క్రీడాకారుడు కీ నిషికోరి... యూఎస్ ఓపెన్‌లో సంచలనం సృష్టించాడు. బుధవారం అర్ధరాత్రి (భారత కాలమానం ప్రకారం గురువారం ఉదయం) జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్‌ఫైనల్లో 10వ సీడ్ నిషికోరి 3-6, 7-5, 7-6 (9/7), 6-7 (5/7), 6-4తో ప్రపంచ 4వ ర్యాంకర్, మూడోసీడ్ స్టాన్ వావ్రింకా (స్విట్జర్లాండ్)పై విజయం సాధించాడు. దీంతో 96 ఏళ్ల తర్వాత సెమీస్‌కు చేరిన జపాన్ ఆటగాడిగా రికార్డులకెక్కాడు. చివరిసారి 1918లో ఇచియా కుమాగే సెమీఫైనల్‌కు చేరాడు. 4 గంటలా 15 నిమిషాల పాటు ఈ మ్యాచ్ జరిగింది. రెండో గేమ్‌లో నిషికోరి సర్వీస్‌ను బ్రేక్ చేసి వావ్రింకా తొలిసెట్‌ను గెలుచుకున్నాడు.
అయితే రెండోసెట్ ఎనిమిదో గేమ్‌లో వావ్రింకా మూడు బ్రేక్ పాయింట్లను కాచుకున్నా.. 12వ గేమ్‌లో నాలుగో డబుల్ ఫాల్ట్ చేయడంతో సెట్ చేజారింది. 5-2 ఆధిక్యంతో మూడోసెట్‌ను ప్రారంభించిన నిషికోరి తొమ్మిదో గేమ్‌లో సెట్ పాయింట్‌ను కోల్పోయాడు. దీంతో టైబ్రేక్ అనివార్యమైంది. టైబ్రేక్‌లో నిషికోరి బ్యాక్‌హ్యాండ్ షాట్లతో హోరెత్తించాడు. నాలుగోసెట్‌లో మూడు గేమ్‌ల తర్వాత బొటన వేలికి చికిత్స తీసుకున్న 24 ఏళ్ల నిషికోరి ఆ తర్వాత వావ్రింకాను కోలుకోనివ్వలేదు. ఐదోసెట్‌లో ఐదు, పది గేమ్‌ల్లో వావ్రింకా బ్రేక్ పాయింట్‌ను కోల్పోవడంతో నిషికోరికి విజయం దక్కింది. ఓవరాల్‌గా మ్యాచ్ మొత్తంలో 18 ఏస్‌లు సంధించిన వావ్రింకా 78 అనవసర తప్పిదాలతో మూల్యం చెల్లించుకున్నాడు. 10 బ్రేక్ పాయింట్ అవకాశాల్లో రెండింటిని మాత్రమే సద్వినియోగం చేసుకున్నాడు.
జొకోవిచ్ జోరు
మరో క్వార్టర్స్ మ్యాచ్‌లో టాప్‌సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 7-6 (7/1), 6-7 (1/7), 6-2, 6-4తో 8వ సీడ్ అండీ ముర్రే (బ్రిటన్)పై నెగ్గి వరుసగా ఎనిమిదోసారి యూఎస్ ఓపెన్ సెమీస్‌లోకి ప్రవేశించాడు. దాదాపు మూడున్నర గంటలు సాగిన ఈ మ్యాచ్‌లో ముర్రే వెన్ను నొప్పితో ఇబ్బందిపడ్డాడు. అద్భుతమైన డిఫెన్సివ్ ఆటతీరును చూపెట్టిన జొకోవిచ్ 16 బ్రేక్ పాయింట్లలో 12 కాపాడుకున్నాడు. 48 అనవసర తప్పిదాలు చేశాడు. ముర్రే 65 అనవసర తప్పిదాలతో మ్యాచ్‌ను చేజార్చుకున్నాడు.
సెరెనా దూకుడు
మహిళల సింగిల్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ సెరెనా విలియమ్స్ (అమెరికా) జైత్రయాత్రను కొనసాగిస్తోంది. క్వార్టర్‌ఫైనల్లో టాప్‌సీడ్ సెరెనా 6-3, 6-2తో 11వ సీడ్ ఫ్లావియా పెన్నెటా (ఇటలీ)పై నెగ్గి సెమీస్‌లోకి దూసుకెళ్లింది.
ఈ సీజన్ తొలి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్‌ఫైనల్ ఆడుతున్న అమెరికన్‌కు పెన్నెటా గట్టిపోటీనే ఇచ్చింది. కేవలం 8 నిమిషాల్లోనే... తన సర్వీస్‌లో రెండు బ్రేక్ పాయింట్లను కాపాడుకుని 3-0 ఆధిక్యంలో నిలిచింది. కానీ తర్వాతి ఆరు గేమ్‌లను నిలబెట్టుకున్న సెరెనా అర్ధగంటలో సెట్‌ను ముగించింది. రెండో సెట్ తొలి గేమ్‌లో సెరెనా రెండు బ్రేక్ పాయింట్లను కాచుకుంది. తర్వాతి రెండు గేమ్‌లను పెన్నెటా సొంతం చేసుకుంది. కానీ చివరి ఐదు గేమ్‌ల్లో జోరును కనబర్చిన సెరెనా మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
మిక్స్‌డ్ ఫైనల్లో సానియా జోడి
భారత స్టార్ క్రీడాకారిణి సానియా మీర్జా-బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జోడి... మిక్స్‌డ్ డబుల్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. సెమీస్‌లో టాప్‌సీడ్ సానియా జంట 7-5, 4-6 (10/7)తో యంగ్ జన్ చాన్ (తైపీ) -రాస్ హచిన్స్ (జర్మనీ)పై నెగ్గింది. గంటా 33 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సానియా-సోరెస్ ఓవరాల్‌గా 73 పాయింట్లు సాధించారు.