చాంప్స్ ఓక్రిడ్జ్, చిరెక్ | oakridge,chirec schools champions in basket ball league | Sakshi
Sakshi News home page

చాంప్స్ ఓక్రిడ్జ్, చిరెక్

Published Sun, Dec 22 2013 11:29 PM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM

oakridge,chirec schools champions in basket ball league

 జింఖానా, న్యూస్‌లైన్: భారత బాస్కెట్‌బాల్ సమాఖ్య (బీఎఫ్‌ఐ) ఐఎంజీ రిలయన్స్ స్కూల్ బాస్కెట్‌బాల్ లీగ్‌లో బాలుర విభాగంలో ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్... బాలికల విభాగంలో చిరెక్ పబ్లిక్ స్కూల్ చాంపియన్స్‌గా నిలిచాయి. వైఎంసీఏలో జరిగిన బాలుర ఫైనల్స్‌లో ఓక్రిడ్జ్ 54-25తో గీతాంజలి స్కూల్‌పై విజయం సాధించింది.
 
 మ్యాచ్ తొలి అర్ధ భాగం ముగిసే సమయానికి ఓక్రిడ్జ్ 28-14తో ముందంజలో నిలిచింది. ముందు నుంచి దూకుడుగా ఆడుతున్న కార్తీక్ (17), సునీత్ (13), విభు (8) తర్వాత కూడా అదే రీతిలో చెలరేగడంతో ఆ జట్టుకు గెలుపు దక్కింది. గీతాంజలి స్కూల్ జట్టులో సహర్ష్ (11), ఒమర్ (10) రాణించారు. బాలికల విభాగం ఫైనల్స్‌లో చిరెక్ పబ్లిక్ స్కూల్ 44-19తో సెయింట్ పాయిస్ హైస్కూల్‌పై నెగ్గి టైటిల్  కైవసం చేసుకుంది.
 
  మొదటి అర్ధ భాగం ముగిసే సమయానికి చిరెక్ 28-8తో ఆధిక్యంలో ఉంది. దృష్టి (16), సబ్రీన్ (8), సంహిత (6) అలవోకగా దూసుకెళ్ళి జట్టుకు విజయాన్ని అందించారు. సెయింట్ పాయిస్ క్రీడాకారిణిలు మౌనిక (9), తేజస్విని (8) చక్కని ఆటతీరు కనబరిచారు. బాలుర విభాగంలో మూడు, నాలుగు స్థానాల కోసం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ 50-36తో చిరెక్ పబ్లిక్ స్కూల్‌పై నెగ్గగా.. బాలికల విభాగంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ 39-30తో ఫ్యూచర్ కిడ్స్ జట్టును ఓడించింది. బాలుర విభాగంలో కార్తీక్ (ఓక్రిడ్జ్), బాలికల విభాగంలో దృష్టి (చిరెక్) ‘ఉత్తమ క్రీడాకారులు’గా ఎంపికయ్యారు.
 
 బీఎఫ్‌ఐ సాంకేతిక కమిటీ చైర్మన్ జీఎం సంపత్ కుమార్ ముఖ్యఅతిథిగా విచ్చేసి విజేతలకు ట్రోఫీలు అందజేశారు. విజేత జట్లకు రూ. 50 వేల చొప్పున నగదు పురస్కారం దక్కింది. రన్నరప్ జట్లకు రూ. 30 వేల చొప్పున... మూడో స్థానం పొందిన జట్లకు రూ. 20 వేల చొప్పున ఇచ్చారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement