
దోమలు, డ్రైనేజీ దుర్గందం మధ్య ఒలింపియన్ నివాసం..!
పొంగిపొర్లుతున్న డ్రైనేజీలు, చెత్తాచెదారం, కంపు వాసన, దోమల బెడద.. ఆ ప్రాంతానికి వెళితే ఎంత త్వరగా బయటపడదామా అనేలా ఉంటుంది. అలాంటిది ఆ ప్రాంతంలో ఓ ఒలింపియన్ కుటుంబం నివసిస్తుందంటే అసలు నమ్మరు. కానీ నిజమే. జార్ఖండ్ రాజధాని రాంచీ శివారు ప్రాంతంలో ఈ దృశ్యం కనిపిస్తుంది. ప్రపంచ ఆర్చరీ మాజీ నెంబర్వన్ దీపికా కుమారి ఇల్లు అక్కడే ఉంటుంది.
సామాన్య మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన దీపిక పట్టుదలతో అంతర్జాతీయ స్థాయి క్రీడాకారిణిగా ఎదిగింది. దేశానికి ఎన్నో పతకాలు అందించింది. ఆమె ప్రతిభను మెచ్చి జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి అర్జున్ ముండా ఓ ప్లాట్ ఇస్తామని హామి వాగ్ధానం చేశారు. అయితే నేటి ఆ హామీ నెరవేరలేదు. నర్స్గా పనిచేస్తున్న దీపిక తల్లి గీతా దేవి శివారు ప్రాంతం రాతు చట్టి వద్ద ఓ చిన్నపాటి ఇల్లు తీసుకుంది.
భారీ వర్షాలు కురిసినప్పుడల్లా ఈ ప్రాంత వాసులకు నరకమే. డ్రైనేజీలు పేరుకుపోయి దుర్గందంతో పాటు దోమల కాటుకు బెంబేలెత్తిపోతారు. డ్రైనేజీలకు మరమ్మత్తులు చేపట్టాలని నాలుగు నెలల క్రితం అర్జీ ఇచ్చినా ఇప్పటికీ పట్టించుకోలేదని గీతా దేవి వాపోయారు.