
ఒలింపిక్స్ పతకమే లక్ష్యం: సాకేత్
ఎన్‌ఏడీ జంక్షన్ (విశాఖపట్నం): ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటే భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధిస్తానని ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ యువతార సాకేత్ మైనేని విశ్వాసం వ్యక్తం చేశాడు. 2016 రియో డి జనీరో ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే తన లక్ష్యమని వివరించాడు. ఇంచియాన్ ఆసియా క్రీడల్లో మిక్స్‌డ్ డబుల్స్‌లో స్వర్ణం, పురుషుల డబుల్స్‌లో రజతం నెగ్గిన సాకేత్ శుక్రవారం తన స్వస్థలం విశాఖపట్టణానికి చేరుకున్నాడు. విమానాశ్రయంలో అతనికి తల్లిదండ్రులు సరోజ, ప్రసాద రావు, శివా టెన్నిస్ సెంటర్ సభ్యులు, మిత్రులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆసియా క్రీడల్లో ఆడడం, స్వర్ణం సాధించడం ఎంతో సంతోషంగా ఉందన్నాడు.