
ఒమర్ ఫిలిప్స్ క్షేమం
బంతి తగిలి స్పృహ కోల్పోయిన విండీస్ క్రికెటర్
కింగ్స్‌టౌన్: క్రికెట్ బంతులకు ప్రాణాలు వదిలిన ఆసీస్ క్రికెటర్ ఫిలిప్ హ్యూస్, ఇజ్రాయెల్ అంపైర్ ఉదంతాలు మరువకముందే మరోసారి దాదాపు అలాంటి సంఘటనే జరిగింది. వెస్టిండీస్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్ సందర్భంగా బార్బడోస్ బ్యాట్స్‌మన్ ఒమర్ ఫిలిప్స్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
శుక్రవారం విండ్‌వార్డ్ ఐలాండ్స్‌తో జరిగిన మ్యాచ్ సందర్భంగా నాన్‌స్ట్రయికర్‌గా ఉన్న ఫిలిప్స్ తమ బ్యాట్స్‌మన్ షాయ్ హోప్ షాట్‌ను తప్పించుకునే క్రమంలో బంతి తల వెనుక భాగంలో బలంగా తాకింది. వెంటనే స్పృహ కోల్పోయిన ఫిలిప్స్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లి సీటీ స్కాన్ తీయించారు. అయితే ఇందులో ఎలాంటి ప్రమాదం లేదని తేలింది. ఫిలిప్స్ వెస్టిండీస్ తరఫున రెండు టెస్టులు ఆడాడు.