29న బీసీసీఐ, పీసీబీ సమావేశం
ద్వైపాక్షిక సిరీస్‌లపై చర్చ
దుబాయ్: భారత్, పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌ల నిర్వహణకు సంబంధించి ఈ నెల 29న కీలక సమావేశం జరగనుంది. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ), పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అధికారులు దుబాయ్‌లో జరిగే ఈ భేటీలో పాల్గొంటారు. ఎంఓయూ ప్రకారం 2015–2023 మధ్య ఎనిమిదేళ్ల కాలంలో ఇరు జట్ల మధ్య ఆరు ద్వైపాక్షిక సిరీస్‌లు జరగాల్సి ఉంది.
అయితే రెండు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇందులో ఒక్క సిరీస్ కూడా జరిగే అవకాశం కనిపిం చడం లేదు. ఇదే విషయంపై ఇటీవల పీసీబీ, భారత్‌కు నోటీసు పంపించగా... ఎంఓయూ అసలు ఒప్పందమే కాదం టూ బీసీసీఐ తేలిగ్గా తీసిపారేసింది. ఈ నేపథ్యంలో సాగే చర్చల్లో ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.
ప్రభుత్వం అనుమతిస్తేనే...
మరో వైపు ద్వైపాక్షిక సిరీస్‌ల విషయాన్ని ఇప్పటికే భారత ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళామని, అక్కడి నుంచి ఎటువంటి సానుకూల సంకేతాలు రాలేదని బోర్డు వర్గాలు వెల్లడించాయి. ‘భారత్, పాక్ క్రికెట్ సిరీస్‌ల విషయంలో యథాతథ స్థితే కొనసాగుతోంది. ఇందులో ఎలాంటి ముందడుగు లేదు. మూడు నెలల క్రితమే భారత ప్రభుత్వానికి అనుమతి కోరుతూ లేఖ రాశాం. మళ్లీ 15 రోజుల క్రితం ఇదే విషయాన్ని గుర్తుచేశాం. కానీ కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు రాలేదు. పాక్‌తో ఆడటమనేది పూర్తిగా ప్రభుత్వం చేతుల్లోనే ఉంది. ఇందులో మేం చేయగలిగిందేమీ లేదు’ అని బోర్డు తాత్కాలిక కార్యదర్శి అమితాబ్ చౌదరి స్పష్టం చేశారు.