
బాడీ బిల్డర్ అయ్యప్పకు ఆర్థిక సాయం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన బాడీ బిల్డర్ అయ్యప్పకు ప్రభుత్వం లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ మేరకు శనివారం శాట్స్ చైర్మన్ ఎ. వెంకటేశ్వర రెడ్డి ప్రభుత్వం జారీ చేసిన లక్ష రూపాయల చెక్‌ను ఆయన చాంబర్‌లో అయ్యప్పకు అందజేశారు. పేద కుటుంబానికి చెందిన అయ్యప్ప భవిష్యత్తులో ప్రపంచస్థాయి బాడీ బిల్డర్‌గా ఎదిగి రాష్ట్రానికి పతకాలు సాధించి పెట్టాలని ఈ సందర్భంగా శాట్స్ చైర్మన్ కోరారు. అయ్యప్ప 2016 కర్ణాటకలో జరిగిన జాతీయ సీనియర్ మిస్టర్ ఇండియా పోటీల్లో 75 కేజీల విభాగంలో రజత పతకాన్ని సాధించాడు. ప్రస్తుతం ఈ ఏడాది నవంబర్‌లో అమెరికాలోని మియామిలో జరుగనున్న మిస్టర్ వరల్డ్ పోటీల కోసం అతను సాధన చేస్తున్నాడు. తనను ప్రోత్సహిస్తోన్న రాష్ట్ర ప్రభుత్వానికి, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర రెడ్డికి ఈ సందర్భంగా అయ్యప్ప కృతజ్ఞతలు తెలిపాడు.