సాక్షి, హైదరాబాద్: ఆరేళ్ల క్రితం సరిగ్గా ఇదే రోజు టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. సిక్సర్లు, ఫోర్లతో బౌలర్లపై విరుచుకుపడుతూ.. వన్డే కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీతో పాటు ప్రపంచ రికార్డు నమోదు చేశాడు. అంతకు ముందు తన గురువు సచిన్ పేరిటి ఉన్న ఈ రికార్డును అధిగమించాడు. వన్డే చరిత్రలో రెండో డబుల్ సెంచరీ సాధించిన రెండో బ్యాట్స్‌మనే కాకుండా.. అప్పటికి వన్డే క్రికెట్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు నమోదు చేసిన బ్యాట్స్‌మన్‌గా గుర్తింపు పొందాడు. తరువాత ఈ రికార్డును భారత ఆటగాడు రోహిత్ శర్మ(264) అధిగమించిన విషయం తెలిసిందే.
డిసెంబర్ 8, 2011లో ఇండోర్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన నాలుగో వన్డేలో సెహ్వాగ్ 149 బంతుల్లో ఏకంగా 25 ఫోర్లు, 7 సిక్సులతో 219 పరుగులు చేశాడు. దీంతో భారత్ 418 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో భారత్ విండీస్‌పై 153 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. వన్డేల్లో భారత్ జట్టు నమోదు చేసిన అత్యధిక పరుగులు (418) కూడా ఇవే కావడం విశేషం.
వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు కలిగిన క్రికెటర్ల జాబితాలో వీరేంద్ర సెహ్వాగ్ మూడో స్థానంలో ఉన్నాడు. రోహిత్ శర్మ(264), గప్టిల్(237) అతడికంటే ముందున్నారు.
Comments
Please login to add a commentAdd a comment