
పసలేని ఐబీఎల్ ప్రారంభోత్సవం
న్యూఢిల్లీ: గత కొన్ని రోజులుగా ఎంతో ఊరిస్తున్న ఇండియన్ బ్యాడ్మింటన్ లీగ్ (ఐబీఎల్) ప్రారంభోత్సవ కార్యక్రమం ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. స్టార్ల హంగామా... బాణాసంచా మెరుపులు... హాలీవుడ్, బాలీవుడ్ తళుకులు లేకపోవడంతో కార్యక్రమం మొత్తం బోసిపోయింది.
సిరి ఫోర్ట్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో షెడ్యూల్ సమయానికి గంట ఆలస్యంగా మొదలైన ఈ కార్యక్రమం 30 నిమిషాల్లోనే ముగిసింది. ఆరు ఫ్రాంచైజీల ఐకాన్ ప్లేయర్లతో... బ్యాడ్మింటన్ అసోసియేషన్ (బాయ్) అధ్యక్షుడు అఖిలేష్ దాస్ గుప్తా ప్రమాణం చేయించారు. లేజర్ షో తర్వాత నార్వేకు చెందిన డ్యాన్సర్లు స్టేడియంలో ఉన్న కొంత మంది అభిమానులను అలరించగా.... చివర్లో గాయకుడు నీతి మోహన్ బాలీవుడ్ పాటలు పాడి వినిపించారు. మొత్తానికి నిర్వాహకులకు ముందు చూపులేక కార్యక్రమం మొత్తం అస్తవ్యస్తంగా సాగింది.