
చిన్నారులకు ఫ్రీగా ఒలింపిక్స్ టికెట్లు
రియోడీజనీరో: ఆటలంటే చిన్నారులకు ఎంతో ఇష్టం. మరి ప్రపంచంలోనే పెద్ద ఆటల పండుగ.. రియో ఒలింపిక్స్ జరుగుతుంటే చిన్నారులు మాత్రం ఇంట్లో ఎందుకు కూర్చోవాలి?... సరిగ్గా ఇలాగే అనుకుందేమో... రియో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ రెండు లక్షల మంది చిన్నారులకు ఒలింపిక్స్ టికెట్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆర్గనైజింగ్ కమిటీ కమ్యూనికేషన్స్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ మారియో అండ్రాడా గురువారం వెల్లడించారు.
టికెట్ల అమ్మకం దాదాపుగా పూర్తయిందని, వందశాతం రెవెన్యూ వచ్చినందున కొన్ని టికెట్లను చిన్నారులకు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించుకున్నామని ఆండ్రాడా తెలిపారు. బ్రెజిల్‌లో ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాల్లో లబ్ధిదారులుగా ఉన్న పిల్లలకు ఈ టికెట్లు ఉచితంగా అందజేస్తామని చెప్పారు. నేటి నుంచి 21వ తేదీ వరకు బ్రెజిల్ రియో నగరంలో ఒలింపిక్స్ క్రీడలు జరుగనున్నాయి.