ఆ బాధ ఎప్పటికీ ఉంటుంది: సెహ్వాగ్
న్యూఢిల్లీ: తనకు వీడ్కోలు టెస్టు ఆడే అవకాశం రాలేదన్న బాధ ఎప్పటికీ మదిని తొలుస్తూనే ఉంటుందని భారత డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశాడు. తనతో ముందుగానే చెప్పి ఉంటే వీడ్కోలుపై ఒక నిర్ణయం తీసుకునే వాడినని పేర్కొన్నాడు. తన వీడ్కోలులో భాగంగా ఒక టెస్టు ఆడే అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదన్నాడు. ఇండియన్ టీవీ షో 'ఆప్ కీ అదాలత్' తో మాట్లాడిన సెహ్వాగ్.. ఢిల్లీలో చివరి టెస్టు ఆడేందుకు ఒక అవకాశం ఇవ్వమని సెలెక్టర్లను అడిగినా ఇవ్వలేదని పేర్కొన్నాడు. తాను ఆడుతుండగానే రిటైర్మెంట్ కావాలనుకున్నానని.. అలా జరగకపోవడంతో అది ఎప్పటికీ వెలితిగానే ఉండిపోతుందని సెహ్వాగ్ ఆవేదన వ్యక్తం చేశాడు.
'నా జీవితంలో ఆట అనేది ఒక భాగంగా సాగింది. ఎప్పటి వరకూ ఆడాలి.. ఎప్పుడు రిటైర్మెంట్ కావాలి అనేది ముందుగా ఊహించుకోలేకపోయా. ఎప్పుడైతే నన్ను జట్టులోంచి తొలగించారో అప్పటివరకూ రిటైర్మెంట్ ఆలోచన రాలేదు. ఈ కారణం చేతనే నా వీడ్కోలు కార్యక్రమం ఇలా జరిగింది 'అని సెహ్వాగ్ తన మనసులో బాధను బయటపెట్టాడు.