
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) తాజా సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ హ్యాట్రిక్ విజయాలు సాధించడంతో ప్లే ఆఫ్‌పై ఆశల్ని సజీవంగా ఉంచుకుంది. ఇటీవల ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో రాజస్తాన్ రాయల్స్ ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించడం ద్వారా వరుసగా మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. ముంబైతో కీలకమైన మ్యాచ్‌లో జోస్ బట్లర్‌తో పాటు జోఫ్రా ఆర్చర్ రాణించడం వల్లే రాజస్తాన్ విజయం సాధ్యమైందని అంటున్నాడు భారత దిగ్గజ ఆటగాడు కృష్ణమాచారి శ్రీకాంత్. ఆ క్రెడిట్ మొత్తం బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ ఇవ్వడం సరైనది కాదని శ్రీకాంత్ అభిప్రాయపడ్డాడు. ఆ విజయంలో ఇద్దరికీ సమాన క్రెడిట్ ఇస్తేనే బాగుంటందన్నాడు. ఈ సందర్భంగా ముంబై ఇండియన్స్‌తో మ్యాచ్‌లో జోఫ్రా ఆర్చర్ పొదుపుగా బౌలింగ్ వేసిన విషయాన్ని శ్రీకాంత్ గుర్తు చేశాడు. ఆర్చర్ తన కోటా నాలుగు ఓవర్ల బౌలింగ్‌లో రెండు వికెట్లు తీయడమే కాకుండా 14 డాట్ బాల్స్ వేసి జట్టు విజయంలో తనవంతు పాత్రను సమర్ధవంతంగా పోషించాడన్నాడు.
‘బౌలర్లు వేగంగా బంతులు వేస్తూ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేస్తుంటే అది క్రికెట్‌లో ఆహ్లాదకర దృశ్యమే. అయితే ఐపీఎల్‌లో బౌలర్లకు అంత అదృష్టం లేదు. వారి కృషికి తగిన గుర్తింపు లభించడంలేదు. జోఫ్రా ఆర్చర్ వంటి బౌలర్ ఎంత కష్టపడినా ప్రశంసలన్నీ బ్యాట్స్‌మెన్‌కే దక్కుతున్నాయి. ఆర్చర్, బట్లర్‌లే రాజస్థాన్ జట్టు బలం. ఆర్చర్ బ్యాట్స్‌మెన్‌కు కళ్లెం వేస్తుంటే, బట్లర్ పరుగులతో జట్టును గెలిపిస్తున్నాడు. కేవలం బట్లర్‌కే క్రెడిట్ ఇవ్వడం తగదు. ముంబైతో జరిగిన మ్యాచ్‌లో వీరిద్దరి కృషి వల్లే రాజస్తాన్ గెలిచింది’ అని శ్రీకాంత్ తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment