
పాక్ టి20 కెప్టెన్ గా సర్ఫరాజ్
కరాచీ: పాకిస్తాన్ టి20 నూతన కెప్టెన్‌గా వికెట్ కీపర్ సర్ఫరాజ్ అహ్మద్‌ను నియమించారు. టి20 ప్రపంచకప్‌లో దారుణ వైఫల్యం అనంతరం కెప్టెన్సీకి షాహిద్ ఆఫ్రిది రాజీనామా చేసిన విషయం తెలిసిందే. దీంతో వైస్ కెప్టెన్‌గా ఉన్న సర్ఫరాజ్‌కు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు పాక్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ప్రకటించింది. గత కొన్నేళ్లుగా మూడు ఫార్మాట్లలో నిలకడగా రాణిస్తూ సర్ఫరాజ్ ఆకట్టుకుంటున్నాడు. ‘కెప్టెన్‌గా ఎన్నిక కావడం గౌరవంగా భావిస్తున్నాను. తిరిగి మా జట్టు టాప్ ర్యాంకును అందుకునేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తాను’ అని 28 ఏళ్ల సర్ఫరాజ్ తెలిపారు. ఇప్పటికే టెస్టులకు మిస్బా, వన్డేలకు అజహర్ అలీ కెప్టెన్లుగా కొనసాగుతున్నారు.