'మా వన్డే ర్యాంక్తో ఆందోళనగా ఉంది'
కరాచీ: ప్రస్తుత పాకిస్తాన్ వన్డే ర్యాంకు పట్ల ఆ జట్టు కెప్టెన్ అజహర్ అలీ ఆందోళన వ్యక్తం చేశాడు. అంతకుముందు ఎప్పుడూ లేనంతగా పాకిస్తాన్ వన్డే ర్యాంకింగ్స్ లో తొమ్మిదో ర్యాంకు దిగజారిపోవడం తీవ్ర నిరాశ కల్గిస్తుందన్నాడు. వచ్చే సంవత్సరం నాటికి ఇదే పరిస్థితి కొనసాగితే వరల్డ్ కప్-2019 క్వాలిఫయింగ్ రౌండ్ ను ఎదుర్కోవాల్సి రావడం ఖాయమన్నాడు. గతేడాది ఏప్రిల్ లో బంగ్లాదేశ్లో జరిగిన వన్డే సిరీస్ను 3-0 తేడాతో కోల్పోవడమే తమ ర్యాంకు మరింత కిందకు పడిపోవడానికి ప్రధాన కారణమన్నాడు.
ఈ తరుణంలో ప్రధాన జట్లపై గెలిచి ర్యాంకును మెరుగుపరుచుకోవడం ఒక్కటే తమ ముందున్న మార్గమన్నాడు. తమ ర్యాంకు మెరుగుపరుచుకోవడానికి శాయశక్తుల కృషి చేస్తామని అజహర్ అలీ తెలిపాడు. గత బుధవారం విడుదల చేసిన ఐసీసీ వన్డే ర్యాంకింగ్స్లో పాకిస్తాన్ ఒక స్థానం దిగజారి తొమ్మిదో స్థానానికి పడిపోయిన సంగతి తెలిసిందే.